కేంద్రంలోని బీజేపీని గద్దె దింపుడే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం ముంబైలో పర్యటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు. ఉద్దవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీపై భిన్న వాదనలు వస్తున్నాయి. ఈ సమావేశానికి సంబంధించి తెలంగాణ సీఎంవో రాజకీయ ప్రకటనలు చేసింది. అందుకు భిన్నంగా మహారాష్ట్ర సీఎంవో ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
రాజకీయ అంశాలు, జాతీయ రాజకీయాలపై చర్చించామని సీఎం కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర సర్కార్ మాత్రం రాజకీయేతర అంశాలను మాత్రమే ప్రస్తావించింది. ఇద్దరు నేతలు ఏ మాట్లాడుకున్నారనే అంశాలపై స్వయంగా తెలంగాణ సీఎంవోనే మీడియాకు ప్రకటనలు ఇచ్చినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ పేర్కొంది. తెలంగాణ సీఎంవో చేసిన ప్రకటనల్లో రాజకీయ అంశాల ప్రస్తావన కూడా ఉంది.
బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తోన్న పోరును శివసేనాని పొగడడం, కేంద్రంపై పోరులో కేసీఆర్ కు ఠాక్రే అండగా ఉంటానన్న అంశాలను సీఎంవోనే పేర్కొంది. తెలంగాణ సీఎంవోకు భిన్నంగా కేసీఆర్-ఠాక్రే భేటీపై మహారాష్ట్ర సీఎంవో భిన్నమైన ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
కేసీఆర్తో చర్చల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామనే అభిప్రాయాన్ని విలేకరులతో వెల్లడించారు. మహా సీఎంవో ట్విటర్లో మాత్రం కేసీఆర్తో భేటీ సందర్భంగా పరిశ్రమలు, మౌలిక వసతులు, నీటిపారుదల, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్మాణంలో పరస్పర సహకారం గురించి చర్చించినట్లు తెలిపారు. రాజకీయపరమైన అంశాలను మాత్రం శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ద్వారా వెల్లడించింది.
ఉద్దవ్ థాకరే, కేసీఆర్ మధ్య సమావేశం బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రాజకీయ ఐక్యత ప్రక్రియను వేగవంతం చేస్తుందని సామ్నా ట్విటర్లో వెల్లడించింది. సీఎంవోను రాజకీయ అంశాలకు దూరంగా ఉంచడం ద్వారా కేసీఆర్ కు భిన్న వైఖరిని ప్రదర్శించినట్లయింది.