“ఏళ్ల సంది గుక్కెడు నీళ్లకు నోచుకోలే ! మా గూడేనికి రాస్తా లే. అసలు ఇక్కడ మేమున్నామనేదే సర్కారుకు యాది లే. గిప్పుడు బోర్లు ఏసిన్రు. నీళ్లొచ్చినయ్. రోడ్డు వేస్తున్రు. మా స్కూల్లా పంతులొచ్చిండు. గిదంతా సాధ్యమైతదనుకోలే సార్ !” కుండి షేకు గూడ యువకుడు భీంరావు సంతోషంగా చెప్పిన మాటలు ఇవి. తొమ్మిది రోజుల పోరాటం షేకుగూడ నివాసుల తలరాతనే మార్చేసింది. మొక్కవోని దీక్షతో ఆదివాసీలు సాగించిన పోరుకు ప్రభుత్వం దిగొచ్చింది. వాళ్ల అకుంఠిత పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం.
అది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండి షేకుగూడ గ్రామం. ఇది పంచాయతీ కేంద్రం. దీని కింద మరో రెండు మూడు శివారు గ్రామాలున్నాయి. సుమారు 70 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో నీళ్లు లేవు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ లేదు. స్కూల్లో ఉపాధ్యాయులు ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడసలు ప్రజలున్నారనే స్పృహే ప్రభుత్వాలకు లేదు.
సుమారు 200పైగా జనాభా ఉంటారు. గోండుల అభివృద్ధి కోసం ఐటీడీఏ ద్వారా కోట్లు ఖర్చు పెడుతున్నామని నేతల కోతలకు కొదవ లేదు. ఆచరణలో అసలు వాళ్లవైపు కన్నెత్తి కూడా చూడని దైన్యం కనిపిస్తోంది.
సీపీఎం కార్యకర్తలు ఆ గ్రామాన్ని సందర్శించారు. యువకులను పోగేసి అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఆ వినతులన్నీ దున్నపోతుపై వడగళ్ల వానలా అయిపోయాయి. అధికారులు స్పందించలేదు. ఇక ఇలా కాదనుకున్నారు.
ఊరంతా ఏకమై జిల్లా కేంద్రానికి పాదయాత్ర చేయాలనుకున్నారు. నడవలేని వృద్ధులు, చంటి పిల్లలు మినహా అంతా బయల్దేరారు. ఫిబ్రవరి 6న ‘ఆదివాసీ జల్, సడక్ ఆందోళన యాత్ర’ పేరిట నడక మొదలు పెట్టారు. సీపీఎం కార్యకర్తలు పాదయాత్రను ముందుండి నడిపించారు.

దాదాపు 70 కిలోమీటర్ల దూరం. చద్ది, రొట్టెలు మూట గట్టుకున్నారు. ‘పాలకులారా లజ్జా మాంట్.. అధికారులారా లజ్జా మాంట్( లజ్జా మాంట్ అంటే సిగ్గుపడండి) అంటూ నినదిస్తూ పాదయాత్ర చేపట్టారు. సాయంత్రానికి ఓ ఆలయంలో తలదాచుకున్నారు. వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు. తిరిగి మరుసటి రోజు కదిలారు. రెండు రోజుల్లోనే అదిలాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నిరసన దీక్షకు దిగారు.
ఆదివాసీలంటే మన పూర్వీకుల సంతతి. వాళ్లు లేకుంటే మనం లేమని ఆదిలాబాద్ వాసులు గుర్తించారు. వాళ్ల నిరసన దీక్షకు మద్దతుగా నిలిచారు. అన్నం పెట్టారు. నీళ్లిచ్చారు. మీకు తోడు మేమున్నామంటూ అక్కున చేర్చుకున్నారు.
రెండు రోజుల్లోనే అధికారులు వచ్చి కల్లబొల్లి హామీలు ఇచ్చారు. ఆదివాసీలు ససేమిరా అన్నారు. యుద్ద ప్రాతిపదికన పనులు చేపడితేనే అక్కడ నుంచి కదులుతామని భీష్మించారు. వారం రోజుల పాటు దీక్షను కొనసాగించారు. ప్రజా సంఘాలు, పాత్రికేయులు అండగా నిలిచారు. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది.
కుండి షేకుగూడలో వెంటనే మూడు బోర్లు వేశారు. మోటార్లు బిగించి నల్లాల ద్వారా నీటి సరఫరా ప్రారంభించారు. పాఠశాలకు ఉపాధ్యాయుడు వచ్చాడు. అంతర్గత రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ రూ.4.30 లక్షలు మంజూరు చేసింది. పిప్పిరి నుంచి కుండి షేకుగూడ వరకు ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ఆదివాసీలు అకుంఠిత దీక్షతో చేపట్టిన పోరాటం 70 ఏళ్ల కష్టాలను కడతేర్చింది. తెలంగాణ అంతటా వాళ్ల పోరాట పటిమ గురించి మాట్లాడుకునేట్లు చేశారు. హక్కుల కోసం.. అణచివేతను నిరసిస్తూ సాగే ఉద్యమాలకు ఆదివాసీల పోరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.