రైతులు కష్టాల కన్నీటితో కుములుతుంటే మేమున్నామన్నారు. కౌలు రైతుల కన్నీరు తుడుస్తామని భరోసానిచ్చారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ చిరుద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వేడుకుంటే తాము విన్నామన్నారు. రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. సొంతింటి కల నెరవేర్చాలని పేదలు అడిగితే ఇంటి స్థలమిచ్చి ఇల్లు కట్టిస్తామని హామీనిచ్చారు. ఇప్పుడు వీళ్లంతా తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ఆచరణలో ఏం జరుగుతోంది ! ఎటు పోతున్నారు !
రాష్ట్ర వ్యాప్తంగా సెంటు భూమిలేని సుమారు 15 లక్షల మంది కౌలు రైతులున్నారు. వాళ్లను ఆదుకోవడానికి కొత్త కౌల్దారీ చట్టం తీసుకొచ్చారు. అది పూర్తిగా భూ యజమానుల అంగీకారంతోనే ముడిపడి ఉంది. ఇక్కడ కౌల్దారుల ప్రయోజనాల కోసం చట్టం చేసినట్లు లేదు.
దీంతో వరి సాగు చేసే 75 శాతం మంది కౌలు రైతులు నేటికీ పంట రుణం పొందలేకపోతున్నారు. ప్రభుత్వ రాయితీలు అందడం లేదు. చివరకు పంటను కూడా మద్దతు ధరకు విక్రయించుకోలేని దుస్థితిలోని నెట్టివేయబడ్డారు.
ఈ ఏడాది 5.13 లక్షల ఎకరాల్లో మిర్చి సాగయింది. అందులో 80 శాతం మంది కౌలు రైతులే. తామర పురుగుతో ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర దాకా నష్టపోయారు. వరి సాగు చేసిన రైతులు ధాన్యం మద్దతు ధరకు విక్రయించుకోలేక ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు నష్టం చవిచూశారు.
ఇటీవల ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కో రైతుకు పది నుంచి పదిహేను వేల రూపాయలు అందించారు. అది నష్టపోయిన మిర్చి రైతులకు పదో వంతు మాత్రమే. ఇప్పుడు మిర్చి రైతులు కోలుకునే పరిస్థితి లేదు.
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదనే వేదనలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరకు పీఆర్సీ ఫిట్మెంటు తగ్గించి ఐఆర్ రికవరీ పెడుతున్నారని కువకువలాడుతున్నారు. మొత్తం 14 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ తీరును తీవ్రంగా గర్హిస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఆరు లక్షల మంది పేదలు టిడ్కో ఇళ్లకు డబ్బు కట్టారు. అందులో సగం ఇళ్లు నిర్మాణం పూర్తయింది. మరో మూడు లక్షల ఇళ్లు సగంలో ఆగిపోయాయి. వాటి గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాల్లేవు. లబ్దిదారులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటిదాకా ఇళ్లను లబ్దిదారులకు అందించలేదు. ఒక్క రూపాయికే ఈ ఇళ్లను ఇస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికి ఒక్క ఇల్లు కూడా వాళ్లకు అందించలేదు. లబ్దిదారులంతా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
జగనన్న కాలనీల్లో 30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికి అందులో పదిశాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో సొంతంగా ఏ లబ్దిదారుడు ఇల్లు కట్టుకోలేడు. ప్రభుత్వం నిర్మించి ఇస్తామని మాట తప్పింది. మీరే కట్టుకోవాలంటే సాధ్య పడుతుందా !
ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్లు మాత్రమే కట్టుకోగలరు. అందువల్లే జాప్యం జరుగుతోంది. ఇవన్నీ సర్కారు దృష్టికి రాలేదా ! ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు సగానికి పైగా జనాభా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పున:సమీక్షించుకుంటారా !