ఆయనో మీడియం రేంజ్ స్టార్ హీరో. ఐదారు సినిమాలకు ఓ హిట్ కొడుతుంటాడు. చాలా కాలం తర్వాత గత ఏడాది ఓ సినిమా హిట్ కొట్టాడు. ఆయన సినిమా తాజాగా విడుదలై యావరేజ్ టాక్ తో నడుస్తోంది. బయ్యర్లు సగానికి పైగా నష్టపోయారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత ఏకంగా ఈ సినిమా కోసం రూ. 65 కోట్లను పెట్టుబడిగా పెట్టడం గమనార్హం.
ఇది సదరు హీరో కెరీర్లోనే అతి భారీ బడ్జెట్. అలా అని ఆ దర్శకుడికి ఇంతకు ముందు భారీ హిట్లేమీ లేవు. నిర్మాత అతి మంచితనం, అమాయకత్వంతో దర్శకుడిని పూర్తిగా నమ్మి డబ్బులు కుమ్మరించేశాడు. తీరా చూస్తే సినిమా ఎదురుతన్నేసింది. నిర్మాణ ఖర్చులో చాలా మేరకు సదరు దర్శకుడు తినేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన హీరో సైతం దర్శకుడిని వారించగా.. ఇది తనకు, నిర్మాతకు మధ్య విషయమని సదరు దర్శకుడు తేల్చిచెప్పాడట.
దీంతో హీరో కూడా మరింత తినాలని ఫిక్సయ్యారట. అదనంగా రూ. 2 కోట్లు ఇస్తే తప్ప డబ్బింగ్ చెప్పనని, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానని మొరాయించాడు. గత ఏడాది హిట్ సినిమాకు హీరో తీసుకున్న రెమ్యునరేషన్ కంటే మరో రెండు కోట్లు అదనంగానే ఈ సినిమాకు నిర్మాత చెల్లించాడు. అయినా ఇప్పుడు మరో రెండు కోట్ల అడగటంతో నిర్మాతకు గుండె గుభేలుమంది.
అగ్రిమెంట్ లో అనుకున్న విధంగా డబ్బింగ్ కు కూడా కలిపే కదా రెమ్యునరేషన్ ఇచ్చాను అని నిర్మాత అడిగితే.. ‘‘ఈ సినిమా దర్శకుడి టాలెంట్ తో కాక, నా ఇమేజ్ మాత్రమే జనాన్ని తీసుకొస్తుంది. నేను అనుకున్నట్లుగా ఈ సినిమా రాలేదు. నా బ్రాండ్ వాల్యూ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఈ రెండు కోట్లు అదనం’’ అని కరాఖండీగా చెప్పేశారట.
చేసేది లేక నిర్మాత ఆ రెండు కోట్లను కూడా చెల్లించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా వల్ల చేతులు, మూతులు కాలిపోయిన నిర్మాత ఇకపై మరో సినిమా నిర్మాణం అంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోందని సినీ జనాలు అంటున్నారు. మొత్తంగా ఆ సినిమాతో కేవలం దర్శకుడు, హీరో మాత్రమే లాభపడ్డారన్నమాట.