కొన్ని రోజులుగా అనుమానిస్తున్నట్లే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. ఇరుపక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వద్దని చెబుతున్నా.. ఆంక్షలతో బెదిరించినా.. రష్యా వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా నిలుస్తోంది. నాటో దేశాలు అండగా నిలుస్తున్నాయి. అయినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. రష్యా దాడులను కనీసం ప్రతిఘటించే స్థితిలో కూడా ఉక్రెయిన్ లేదని తెలుస్తోంది. యుద్ధం ఆపే సత్తా ఒక్క భారత్ కే ఉందనే అభిప్రాయం వస్తోంది. అందుకే చివరి ప్రయత్నంగా ఉక్రెయిన్ భారత్ సాయం కోరింది.
ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ తమకు అండగా ఉండాలని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కోరారు. “సైనిక చర్యే అని ప్రకటిస్తోన్న రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి మా భూభాగంలోకి వచ్చేశాయి.
కొన్ని చోట్ల దాడులు జరగ్గా.. సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్ జోక్యం చేసుకుని మాకు అండగా ఉండాలని కోరుతున్నాం.” అని ఇగోర్ పేర్కొన్నారు.
“భారత్ ప్రభావవంతమైన దేశం. దౌత్యపరంగా మీ చరిత్ర గురించి మాకు తెలుసు. గతంలో చాలా సార్లు భారత్ శాంతిస్థాపనలో కీలక పాత్ర పోషించింది. రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అందువల్ల ఉద్రిక్తతలను తగ్గించడంలో దిల్లీ కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తక్షణమే రష్యా అధ్యక్షుడు పుతిన్, మా అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేసి మాట్లాడాలని కోరుతున్నా! ’’అని వెల్లడించారు.
మోడీజీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన నేత. ఎవరు చెబితే పుతిన్ వింటారో లేదో తెలియదు గానీ.. మోడీ చెబితే పుతిన్ వింటారని విశ్వసిస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపేలా మీ బలమైన గళాన్ని కోరుతున్నాం” అని ఇగోర్ పొలిఖా భారత్‌ను కోరారు.
ఉక్రెయిన్-రష్యా వివాదంలో భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఉక్రెయిన్ రాయబారి మోడీ చెబితే పుతిన్ వింటారంటూ భారత జోక్యాన్ని కోరడం ఆసక్తిగా మారింది.