భీమ్లా నాయక్ పై ఆంధ్ర ప్రదేశ్ సర్కారు ఆంక్షలు విధించింది. అన్ని థియేటర్లు కచ్చితంగా జీవో 35ను పాటించాలని థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు స్పష్టం చేసింది. వచ్చే నెల 1న కొత్త జీవో రానుండగా.. అప్పటిలోపు ఆంక్షల్ని అధిగమిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. దీంతో ఇది సంచలనంగా మారింది. నిజంగానే ప్రభుత్వం పవన్ పై కక్షతో కొత్త ఆంక్షలు విధించిందా..? వైసీపీ నేతలు, జగన్ అభిమానుల వెర్షన్ లో చూస్తే.. కొత్త ఆంక్షలు కాదనే వారు చెబుతున్నారు.
‘‘అదనపు షోలు, ముందు నుంచే బెనిఫిట్ షోలు వేయడంపై ఆంధ్రాలో ఎప్పటి నుంచో నిషేధం ఉంది కదా. ప్రత్యేకంగా షోలు వేసుకోవాలంటే అనుమతి తీసుకోవాల్సిందే. మరి తెలంగాణలో అనుమతి తీసుకున్న భీమ్లా సినిమా బృందం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు తీసుకోలేదు?
ఒకవేళ అనుమతి నిరాకరించి ఉంటే.. అప్పుడు నిరసన వ్యక్తం చేస్తే అది వేరే సంగతి. అంతేతప్ప ఉన్న నిబంధనలను పాటించమని ప్రభుత్వం చెబితే దానిపై ఎందుకు రచ్చ చేస్తున్నారు’’ అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.
ఇక పవన్ ఫ్యాన్స్ వాదన మరోలా ఉంది. ఎప్పటి నుంచో నిబంధనలు ఉన్నట్లయితే ఏ తెలుగు సినిమా విడుదలైనా ఇప్పుడిచ్చినట్లే ఆంక్షలను అనుసరించాలని థియేటర్లకు నోటీసులు ఇస్తున్నారా..? పవన్ సినిమాకు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు? అక్కడే పవన్ పై జగన్ కావాలని కక్ష తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది కదా అంటూ పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని అలంకార్, శైలజ థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ రిలీజ్ కు ముందు రోజు భారీ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ సినిమా హిట్టయి ఆయనకు రాజకీయంగా మైలేజీ వస్తుందని భయపడి ఏపీ సర్కారు ఇలా చేస్తోందంటూ పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.