తెలంగాణలో ఎన్నికలకు ఇంకో 20 నెలల గడువున్నా అప్పుడే పార్టీలు దూకుడు పెంచాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. రోజురోజుకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే సీఎం కేసీఆర్ ను కలవడం సంచలనంగా మారింది. గులాబీ బాస్ కు అనధికార దూతగా కొనసాగుతోన్న నటుడు ప్రకాశ్ రాజ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. పీకే టీమ్ సర్వే చేస్తోదంని కేసీఆర్ పార్టీ నేతలు చెబుతున్నారు.
నటుడు ప్రకాశ్ రాజ్ శని, ఆదివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయనతోపాటు ప్రశాంత్ కిషోర్ కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొంత కాలం కిందటే కేంద్రంపై, ప్రధాని మోడీపై యుద్దం ప్రకటించారు. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణకు నడుం బిగించారు.
అందులో భాగంగానే కేసీఆర్ ఇటీవల ముంబై వెళ్లారు. గతంలో చెన్నై పర్యటించారు. త్వరలో బెంగళూరు వెళతారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణతో బీజేపీపై ఉమ్మడి పోరు విషయంలో ప్రశాంత్ కిషోర్ సలహాలను కేసీఆర్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రశాంత్ కిషోర్‌కు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి. ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన పని చేశారు. ఏపీ సీఎంగా జగన్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కోసం పని చేశారు.
2020లో బీజేపీని ఓడించి మమత మరోసారి ముఖ్యమంత్రి కావడానికి పీకే వ్యూహాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. గతంలో పంజాబ్ లో అమరీందర్ సింగ్ కోసం వర్క్ చేశారు. యూపీలో అఖిలేష్ కు కొన్ని సంవత్సరాలు అడ్వైజర్ గా ఉన్నారు పీకే.
జాతీయ రాజకీయాల కోసం పీకే తనకు అవసరమని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అందుకోసమే పీకే హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ తో ప్రకాష్ రాజ్ కలిసి పర్యటించినట్లు తెలుస్తోంది.