తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా.. దాన్ని క్యాష్ చేసుకోవడంలో హస్తం పార్టీ విఫలమవుతోంది. ఇక పార్టీలో వర్గపోరు మరింత ముదురుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య సంభాషణ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది. వీళ్లిద్దరూ ఒకేసారి జంప్ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జగ్గారెడ్డి. రెండు మూడు రోజుల పాటు హల్చల్ చేశారు. ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. 15 రోజుల తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఇదే తరహాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం దాదాపు ఏడాదిన్నరగా సాగుతోంది.
కోమటిరెడ్డి కూడా పలు సార్లు బీజేపీకి అనుకూలంగా , కాంగ్రెస్ కు ఇక భవిష్యత్ లేదన్నట్లుగా మాట్లాడారు. ఢిల్లీలో కమలం అగ్రనేతలను కూడా కలిశారు. ఎందుకో కోమటిరెడ్డి కమలం గూటికి చేరడం ఆగిపోయింది.
జగ్గారెడ్డి ఎపిసోడ్ తర్వాత మళ్లీ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది. పీసీసీ చాలా సీరియస్ గా తీసుకున్న పార్టీ సభ్యత్వ నమోదును కోమటిరెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. ఆయన ఇంట్రెస్ట్ చూపకపోవడంతో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా… సభ్యత్వ నమోదులో మాత్రం చాలా వెనకబడి పోయింది. దీంతో ఎప్పటికైనా కోమటిరెడ్డి పార్టీ మారడం ఖాయమని చెబుతున్నారు.
తాజా ఎపిసోడ్లో జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి మాట్లాడుకున్నారట. జగ్గారెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్న క్రమంలోనే రాజగోపాల్రెడ్డి ఫోన్ చేశారట. రాజీనామాపై తొందరపడకు.. ఇద్దరం కలిసి ఒకేసారి నిర్ణయం తీసుకుందామని జగ్గారెడ్డికి సూచించారట రాజగోపాల్రెడ్డి.
ఇంతలో 15 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని జగ్గారెడ్డి ప్రకటించడంతో.. ఆయన సూచనతోనే ఆ గ్యాప్ తీసుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణపై కాంగ్రెస్ లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు నేతలు కలిసి త్వరలోనే కాంగ్రెస్ కు హ్యాండివ్వడం ఖాయమంటున్నారు.