బిగ్ బాస్ షో ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయింది. అదే ఫార్మాట్ తో తెలుగులో తీసుకొస్తే.. ఇక్కడా మంచి ఆదరణ దక్కించుకోగలిగింది. ఏడాదికి ఒక సీజన్ బిగ్ బాస్ మాత్రమే రావడం జనానికి సరిపోవడం లేదని భావించారో ఏమో.. హాట్ స్టార్ సంస్థ 24 గంటలూ లైవ్ చూపించేలా బిగ్ బాస్ ఓటీటీని తాజాగా ప్రారంభించింది. మొత్తం 84 రోజుల పాటు ఈ షో నాన్ స్టాప్ లైవ్ గా 24 గంటలూ ప్రసారమవుతుంది.
గత సీజన్లలో కొంతమంది సెలబ్రిటీలను కూడా ఈ ఓటీటీ షోలోకి మళ్లీ పంపించారు. వీరిలో అరియానా, ముమైత్ ఖాన్, అఖిల్ సార్థక్, అషూ రెడ్డి, మహేశ్ విట్టా, తేజస్వి మదివాడ, సరయూ, హమీదా ఉన్నారు. ఇక కొత్తగా ఆర్జే చైతు, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, మిత్ర శర్మ, బిందు మాధవి, అజయ్ కథుర్వార్ వంటి వారు ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 17మంది హౌస్ లోకి ప్రవేశించారు.
వాస్తవంగా 18మందిని హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ టీమ్ భావించిందట. ఇప్పుడు ఉన్న ఇంటి సభ్యుల్లో ర్యాపర్ రోల్ రైడా కూడా ఉండాల్సి ఉండగా.. అతడు ఆఖరి నిముషంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు.
లాంచ్ కు రెండు రోజుల ముందే తన ఫోన్ ను కూడా బిగ్ బాస్ టీంకు రైడా హ్యాండోవర్ చేసేశాడని తెలుస్తోంది. సరిగ్గా ముందురోజు అతడి కాలికి గాయం కావడంతో.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గాల్సి వచ్చిందట.
ఆరోగ్యంతో సవాలు కాబట్టి బిగ్ బాస్ బృందం కూడా అతడు వెళ్లిపోవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి మున్ముందు వైల్డ్ కార్డ్ ద్వారా మరో కంటెస్టెంట్ ను ప్రవేశపెడతారో.. లేక రోల్ రైడానే ఆలస్యంగా హౌస్ లోకి పంపుతారో చూడాలి.
అన్నట్లు.. హోస్ట్ గా నాగార్జునే వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి అతిగా వెళ్లడం కూడా ఆసక్తిని కిల్ చేసే అవకాశం ఉంది. మరి టీవీలో వచ్చినంత ఆదరణను ఈ నిరంతర ప్రత్యక్ష ప్రసార బిగ్ బాస్ దక్కించుకుంటుందో లేదా చూడాలి.