“సార్ ! మీరెందుకు అంత ఇదయిపోతారు !
వదిలెయ్యండి.. రోజుకు ఇలాంటోళ్లు ఎందరో.
ఇంట్లో బాధలు చెప్పి అడుక్కోవడం వాళ్లకు అలవాటే !”
అంటూ పక్కన నిలబడిన వ్యక్తి మొహం చిట్లిచ్చాడు.
అజయ్ ఘోష్ పట్టించుకోలేదు.
ఉబికొచ్చిన కన్నీళ్లను పైటచెంగుతో వత్తుకుంటున్న పెద్దమ్మను ఎదురుగా ఉన్న హోటల్‌కు తీసుకెళ్లాడు.
ఇడ్లీ తిన్నాక అక్కడ నుంచి పెద్దమ్మ ఇంటికి బయల్దేరారు.
ఆమెకు ఇద్దరు సంతానం.
కొడుకూ కూతురు పెళ్లిళ్లు చేసింది.
ఇప్పుడు పెనిమిటి లేడు.
కన్నబిడ్డలపై ఆధారపడాల్సి వచ్చింది.
ఆమె పడక బెడ్రూం నుంచి హాల్లోకి వచ్చింది.
అక్కడ నుంచి ప్రతీదానికీ కొడుకును చెయ్యి చాపాల్సి వస్తోంది.
కొడుకు నుంచి కోడలి పెత్తనం వచ్చింది.
చిన్నచిన్న అవసరాలకు కోడలిని అడుక్కోవడం నామోషీ అనిపించింది.
పొరుగునున్న పద్మ భర్త పోయాక పిల్లల దగ్గర ఉండడం లేదు.
వేరే ఇల్లు అద్దెకు తీసుకుంది.
పనికి పోతూ రోజుకు రూ.500 సంపాదించుకుంటోంది.
తాను కూడా అలాగే బతుకీడ్చాలనుకుంది.
చిక్కీలు తయారు చేసే చోట పనికి కుదిరింది.
పెద్దమ్మకు ఆ పనేమీ పెద్ద కష్టమనిపించలేదు.
ప్రశాంతంగా బతుకు వెళ్లదీస్తున్న క్రమంలో..
ఓ రోజు పక్క నుంచి పోతున్న ఆటోవాడు తగిలించడంతో కింద పడిపోయింది.
కాళ్లు చేతులకు గాయాలయ్యాయి.
ఎన్ని మందులు వాడినా గాయాలు మానడం లేదు.
వైద్యుడి సలహా మేరకు షుగర్ టెస్ట్ చేయించింది.
గాయాలు మానక పోవడానికి కారణ: తెలిసింది.
షుగర్ మందులు వాడుకుంటోంది.
ఓ రోజు షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగాయి.
పనిచేసే చోటే పడిపోయింది.
అక్కడ పనిచేసేవాళ్లు ఆమె కుమారుడికి కబురు చేశారు.
కూతురికీ కాల్ చేసి చెప్పారు.
ఎవరూ స్పందించలేదు.
తోటి కార్మికులే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
నెమ్మదిగా కోలుకుంది.
దాచుకున్న సొమ్ము కరిగిపోయింది.
మళ్లీ పని కోసం తిరుగుతోంది.
మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక కుప్పకూలింది.
అజయ్ ఘోష్ పెద్దమ్మను తీసుకొని ఆమె కొడుకు ఇంటికి చేరాడు.
మళ్లీ ఎందుకొచ్చావంటూ కొడుకు తిట్టిపోశాడు.
ఇప్పుడేమైంది పౌరుషమంటూ కోడలు మూతి మూడు వంకర్లు తిప్పింది.
వాళ్ల పిల్లలిద్దరూ నానమ్మను తిడుతుంటే కళ్లు ఇంత పెద్దవి చేసుకొని చూస్తున్నారు.
‘ఆమె ఎలా బతికిందో మీ ఆవిడకు తెలీక పోవచ్చు !
నీకు తెలుసు. నిన్నింతటివాడ్ని చేయడానికి ఆ తల్లి ఎన్ని కష్టాలు పడిందో తెలుసా !
ఏదో ఒకరోజు నీ బిడ్డలు ఇలాగే నిన్ను చీత్కరించుకుంటే తట్టుకోగలవా ?
రామ్మా వెళ్దాం. !” అంటూ పెద్దమ్మను తీసుకొని అజయ్‌ఘోష్ వెనుతిరిగాడు. తెలిసిన వృద్ధుల ఆశ్రమంలో చేర్చాడు.
అక్కడ నుంచి నడుచుకుంటూ బయల్దేరాడు.
మండే ఎండకు చెమటతో ఒళ్లంతా తడిసిపోతోంది.
తెలిసిన అతను కనిపించి బైక్‌పై డ్రాప్ చేస్తానన్నాడు.
వద్దని వారించి నడుస్తూనే ఉన్నాడు.
మస్తిష్కంలో తిరుగుతున్న ఆలోచనలు ఎంతకీ తెగడంలేదు.
ఐదు కిలోమీటర్లు ఎలా నడిచాడో..
ఓ చెట్టు కింద ఆగాడు..
‘ఎంత దూరం నుంచి వస్తున్నావోనయ్యా !
ఒళ్లంతా తడిసి ముద్దయింది.
కాసిని నీళ్లు తాగి మొహం తుడుసుకో నాయనా !’
అంటూ అక్కడున్న ముసలావిడ నీళ్ల బాటిల్ చేతికిచ్చింది.
ఆమె ఆప్యాయత అజయ్ ఘోష్ ఆలోచనలను ఓ కొలిక్కి తెచ్చింది.