‘ఏటి బా.. నీరసంగున్నావ్ ! సరిగ్గా తింటల్లేదా !’
అన్నాడు పురుషోత్తం.
‘అదేం లేదరా ! ఈ రాజకీయాలు చూత్తంటే..
మా చెడ్డ చిరాకేత్తందిరా బామ్మర్ధి !’
అంటూ మాధవ్ విసుక్కున్నాడు.
ఎవడు ఏ పార్టీతో కలుస్తున్నాడో..
ఎందుకు కలుస్తున్నారో..
అసలు ఈ విచిత్ర బంధాలేటో!
అంటూ మాధవ్ మరింత రెట్టించాడు.
‘ఆ.. బా ! శ్యామలా ధియేటర్లో ఇచిత్ర బంధం యాత్తన్నారు బా !
ఎల్దావేటి ! అక్కినేని నాగేశ్వర్రావ్.. వాణిశ్రీ ఇరదీశారనుకో.
చూసి చాన్నళ్లయింది బా. మళ్లోసారి చూద్దాం పోదాం బా !’
అంటూ మాధవ్ చెయ్యి పట్టుకున్నాడు పురుషోత్తం.
మాధవ్‌కు ఎక్కడో సుర్రుమంది.
‘ఎహె.. ఉండ్రా ! షర్మిల వాళ్లాయన బ్రదర్ అనిల్ ఉండవల్లిని కలిశారట.
ఏం మాట్టాడుకున్నారో.. ఏమో !
ఆ పెద్ద మనిషినడిగితే..
ఏవో మాకూ మాకూ బోల్డ్ సీక్రెట్లుంటాయ్.
అవసరమైనప్పుడు బయట పెడతామంటారేట్రా !’
అంటూ చిరగ్గా చూశాడు.
‘అయన్ని ఇప్పుడెందుకు బా !
ఏఎన్నారోడి సినిమా కెల్దాం బా! ’
అన్నాడు పురుషోత్తం బతిమాలుతూ.
అరె బామ్మర్ధి.. ఓ పాలి మన రాష్ట్రంలో పార్టీల గురించి చెప్తారా !
ఆ ఇచిత్ర బంధం గురించి కూసింత పక్కనెట్టి..
వీళ్లదే బంధమో చెప్రా !’
అంటూ నోరు విప్పాడు మాధవ్
‘సీబీఐ అవినాష్‌రెడ్డి మీద కేసెడితే బీజేపీలో చేరిపోతాడు.
ఆ.. ఏమవుద్ది అన్నాడట సీఎం జగన్.
అదేవన్నా నా డ్యాష్ డ్యాష్ పార్టీ అంట్రా ఎవరు పడితే ఆళ్లు చేరడానికి !
బ్యాంకులకు డబ్బులెగ్గొట్టినోళ్ల కాడ నుంచి
రేపులు.. మర్డర్లు చేసేవాళ్లందర్నీ చేర్చుకునేందుకు
అదంత తేడాగాళ్ల పార్టీయంట్రా బామ్మర్ధి ! ’
అంటూ పురుషోత్తం వైపు చూశాడు మాధవ్.
పురుషోత్తం కళ్లప్పగించి చూస్తున్నాడు.
‘అసలు నాకు తెలవకడుగుతారా బామ్మర్దీ !
కేంద్రంలోని బీజేపీకి వైసీపోళ్లు లోపాయకారి మద్దతిత్తున్నారు.
టీడీపీ నుంచి ఏకంగా ఎంపీలే జెండా ఎత్తేసి పువ్వు పార్టీలో చేరిపోయారు.
టీడీపోళ్లు బీజేపోళ్లని పల్లెత్తు మాటనట్లేదు.
ఈడ బీజేపోళ్లు వరసపెట్టి అందర్నీ తిడతారు.
ఇక జనసేనంటే.. మిత్రపక్షమని ఎప్పుడో చేతిలో చెయ్యేసేసుకుంటిరి.
మరీడ ప్రతిపక్షం ఎవర్రా !
అసలీ ఇచిత్ర బంధం సంగతి తేల్చరా బామ్మర్ధి !
మాధవ్ తనపాటికి తాను చెప్పుకుంటూ పోతున్నాడు.
అప్పటిదాకా బుర్ర గోక్కుంటూ ఎర్రి చూపులు చూసిన పురుషోత్తం.. టపీమంటూ కిందపడ్డాడు.
మూర్చ రోగిలా గిలగిల కొట్టుకొంటున్నాడు.
మాధవ్ బిత్తరపోయి ఆడిని భుజానేసుకొని ఆస్పత్రి వైపు కదిలాడు.