భీమ్లా నాయక్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసందర్భంగా సినిమా యూనిట్ మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ప్రైవేటు పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినిమా దర్శకుడు సాగర్ కె చంద్ర, నిర్మాతలు, సంగీత దర్శకుడు తమన్ ఇలా కీలక బృందమంతా హాజరయ్యారు.
తమన్ అయితే తన సింగర్స్ ను తీసుకొచ్చి లైవ్ కన్సర్ట్ పెట్టించాడు. సినిమా విజయవంతమైంది కాబట్టి పార్టీ ఇస్తామని నిర్మాతలు అడిగినా.. త్రివిక్రమ్ వారిని వారించి తానే ఈ పార్టీని ఏర్పాటు చేస్తానని బలవంతపెట్టినట్లు సమాచారం.
సినిమాకు ఏ విధంగానైతే మొత్తం దగ్గరుండి చూసుకున్నాడో.. అదే విధంగా పార్టీని కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చేశాడని తెలుస్తోంది. కేవలం భీమ్లా బృందాన్ని మాత్రమే కాక.. పవన్ తో మున్ముందు సినిమాలు కమిట్ అయిన క్రిష్, హరీశ్ శంకర్, వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ ను కూడా ఈ పార్టీకి ఆహ్వానించారు. క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీశ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలను పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక హాస్యనటులు సునీల్, ఆది వంటివారి హడావుడి సరేసరి. పవన్ పార్టీకి వచ్చినప్పుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ప్లాన్ చేయడం విశేషం. పవన్ ఎంటర్ అవ్వగానే అటు ఇటు పెట్టిన టపాసులు వెలిగాయి. వాటి మధ్యే నడుచుకుంటూ వచ్చిన పవన్, త్రివిక్రమ్ ను హత్తుకున్నారు.
ఇక దర్శకుడు సాగర్ కె చంద్ర తనను తాను మరచిపోయి మరీ స్టెప్పులేసేయడం గమనార్హం. సినిమాలో మంచి పాత్రలు పోషించిన రానా, నిత్య మీనన్ లు మాత్రం పార్టీలో కనిపించలేదు. రానా వేరే పనిలో బిజీగా ఉండడం వల్ల రాలేదని తెలుస్తోంది. త్రివిక్రమ్ పై కోపంతోనే నిత్య పార్టీకి రాలేదని సమాచారం.
చిత్రంలో నిత్య పాత్ర నిడివి ఇంకా ఉంటుందని ఆమె భావించింది. ఆ మేరకు త్రివిక్రమ్ ఆమెకు హామీ ఇచ్చినట్లు అంటున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోనూ మాటల మాంత్రికుడు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రను నిత్యతో చేయించాడు.
భీమ్లాలో ఆమె పాత్రకు కొద్దిగా వెయిట్ పెంచినప్పటికీ.. కీలక సన్నివేశాలు, మంచి మెలోడీ పాటను సినిమా నుంచి తీసేశారు. దీంతో నిత్య త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి అలిగినట్లు భీమ్లా సినిమా వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పవన్ అండ్ కో మాత్రం భీమ్లా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.