నేటి జనరేషన్ హీరోయిన్లలో సాయి పల్లవి చాలా ప్రత్యేకం. ఇతర హీరోయిన్లలో అక్కడక్కడైనా తప్పులు వెతకొచ్చేమో కానీ.. ఇప్పటి వరకూ తన కెరీర్లో సాయి పల్లవి రాంగ్ స్టెప్ వేయలేదు. అశ్లీలత వెంట పరుగులు తీయలేదు. పద్ధతిగా ఉంటూనే స్టార్ డమ్ ను పెంచుకోవడంలో ఆమె విజయవంతమైంది. పైపెచ్చు ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె పెద్ద అందగత్తె కాదు. శరీర సౌష్ఠవమూ లేదు. ఆమెకు ఉన్న క్రేజ్ ప్రస్తుతం మరే హీరోయిన్ కూ లేదంటే ఆశ్చర్యం లేదేమో.
తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవికి అభిమానం ఏ రేంజ్ లో ఉందో తాజాగా ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ సినిమా ప్రిరిలీజ్ వేడుకలో మరోసారి ప్రూవ్ అయింది. ఆమె మైకు పుచ్చుకోగానే పది నిముషాల పాటు ఆడిటోరియమంతా దద్దరిల్లిపోయింది. స్వయంగా ఆమె బతిమలాడినా.. యాంకర్ సుమ వచ్చి చెప్పినా ఆడియన్స్ తగ్గలేదు. ఇక ఈవెంట్ పూర్తయిన తర్వాత ఆమె కారు వెంట అభిమానులు చాలాదూరం పరుగులు పెట్టారు. ఇదే కాదు.
ఇటీవల శ్యామ్ సింగరాయ్ ఈవెంట్ లోనూ ఆమెకు అదే క్రేజ్. ప్రజాభిమానానికి ఆ స్టేజ్ పై ఏకంగా కన్నీళ్లు పెట్టేసుకుందామె. అందుకే.. ‘ఆడవాళ్లు’ తన సినిమా కాదు కాబట్టి, కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చాను. కాబట్టి ఏడిస్తే బాగోదు అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. జనంలో ఆమెకున్న క్రేజ్ ను చూసి అందరూ షాక్ తిన్నారు. దర్శకుడు సుకుమార్ అయితే.. ఆమెను ఏకంగా లేడీ పవర్ స్టార్ అనేశాడు. ఆయనేదో యథాలాపంగా అన్నా అదే నిజం.

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ అని.. లేడీ అమితాబ్ అని విజయశాంతిని పిలిచేవారు. ఆమె కోసమే అభిమానులు సినిమా హాళ్లకు వెళ్లిన సందర్భాలున్నాయి. ఇప్పుడు సాయి పల్లవి అదే దిశగా పయనిస్తోంది. సాయి పల్లవి ఉందంటే చాలు. సినిమా బాగుంటుందనే అభిప్రాయం జనాల్లో కనిపిస్తోంది.
ప్రేమమ్, ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్.. త్వరలో రానాతో విరాట పర్వం.. ఇలా వరసగా సూపర్ హిట్స్ తో ఆమె దూసుకుపోతోంది. ఇక డ్యాన్సుల్లో సాయిపల్లవి చూపించే గ్రేస్ నేటి హీరోయిన్స్ లో ఎవరిలోనూ లేదు. ఫిదా, లవ్ స్టోరీ, రౌడీ బేబీ పాటలతో ఆమె తెచ్చుకున్న రికార్డు వ్యూసే అందుకు సాక్ష్యం.
ఇవన్నీ నాణేనికి ఒకెత్తు. తాను మొటిమలతో ఉన్న కారణంగా.. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ కు నో చెప్పి ఆమె మరో మెట్టు ఎక్కేసింది. అమ్మాయిలు మొటిమలు ఉన్నంత మాత్రాన ఫీలవ్వనక్కర్లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని చాటి చెప్పేందుకు ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ ను ఆమె తిరస్కరించడం విశేషం.
ఎక్కడో ఈటీవీ ఢీ షోలో ఒక కంటెస్టెంట్ గా చేసిన సాయి పల్లవి.. ఆ తర్వాత వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ అవడం.. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఆశ్చర్యంగా చూసే లేడీ పవర్ స్టార్ గా ఎదగడం నిజంగా అద్భుతమే.