ఇప్పటిదాకా కల్యాణ్ జ్యూయలర్స్‌లో బంగారు ఆభరణాలు కొనమంటూ ప్రచారం చేసిన నటుడు నాగార్జునను చూశాం. కొన్న బంగారాన్ని మణప్పురం ఫైనాన్స్‌లో పెడితే మొత్తం విలువకు అప్పు తెచ్చుకోవచ్చని ప్రచారం చేసిన నటుడు వెంకటేష్నూ చూస్తున్నాం. తాజాగా ఓటీఎస్ కట్టడానికి డబ్బుల్లేవా.. అయితే తల తాకట్టు పెట్టయినా చెల్లించండి. వెంటనే గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకు నుంచి లక్షన్నర నుంచి మూడు లక్షల అప్పు పొందండని సీఎం జగన్ సెలవిచ్చారు.
ఓ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ఇలా మాట్లాడడం యాధృచ్చికమా.. లేక స్క్రిప్టు రైటర్ల తప్పిదమో తెలీదు. ఓ సినిమా నటుడో.. సెలబ్రిటీనో ఇలా చెబితే ఎవరూ అంతగా పట్టించుకోరు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన స్థానంలో ఉన్న సీఎం జగన్ ఇలా మాట్లాడడమేమిటని జనం నోటి మీద వేలేసుకుంటున్నారు. పేదలు తేలిగ్గా అప్పులు తెచ్చుకోవాలంటే వెంటనే ఏదో ఒకటి చేసి ఓటీఎస్ చెల్లించాలని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నిన్న జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని పది వేల రుణాన్ని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కట్టించి ఇచ్చిన పక్కా గృహాలకు వన్ టైమ్ సెటిల్ మెంటు కింద డబ్బు చెల్లిస్తే.. రిజిస్ట్రేషన్ పేపర్లను తాకట్టు పెట్టుకొని గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా రుణం ఇస్తుందని వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆ బ్యాంకు శాఖలున్నట్లు తెలిపారు. త్వరగా ఓటీఎస్ చెల్లిస్తే సదరు పత్రాలను బ్యాంకులో పెట్టి అప్పు పొందొచ్చని పేర్కొన్నారు.
ఉపాధి లేదు. చిరు వ్యాపారాలు అంతగా నడవడం లేదు. చిరుద్యోగులకు పూటగడవడమే కష్టంగా ఉంది. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ దయనీయం. పెరిగిన స్టీలు, ఇసుక ధరలతో అంతగా పనులు దొరకడం లేదు. కొత్త ఉద్యోగాల కల్పన లేదు. పుట్టెడు కష్టాల్లో నలుగుతున్న పేదలకు ఓ సీఎం స్థాయిలో జగన్ ఇలా అప్పులు తెచ్చుకోవాలని చెప్పడం సరికాదు.
క్షేత్ర స్థాయిలో తక్షణమే ఉపాధి కల్పించాలి. కొత్త ఉద్యోగాల సృష్టికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఉపాధి కల్పనకు అవకాశమున్న రంగాలపై దృష్టి సారించాలి. దీనికి భిన్నంగా వ్యవహరించడం ఎంతమాత్రం హర్షణీయం కాదు.