ఏపీ సర్కారుకు షాక్ కొట్టే తీర్పునిచ్చింది హైకోర్టు. సీఆర్డీఏపై రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని తేల్చి పారేసింది. ఈ చట్టం ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు పిటిషన్లపై గురువారం ధర్మాసనం సంచలన తీర్పును వెల్లడించింది. ఆరు నెలల్లో సీఆర్డీఏ ప్లాన్ను పూర్తి చేయాలని పేర్కొంది. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించింది.
రాజధానికి భూములిచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరచిన ప్లాట్లను అప్పగించాలని తీర్పులో వెల్లడించింది. జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని కోరింది.
రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు సదరు భూమిని తనఖా పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. రైతులకు నష్ట పరిహారం కింద రూ.50 వేల చొప్పున చెల్లించాలని తీర్పులో పేర్కొంది.
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో వీటిపై విచారణ జరుగుతోంది. విచారణ సమయంలో ఎలా రద్దు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ రెండింటిపై కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నందున ప్రభుత్వం రద్దు చేసింది. మరోసారి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెడుతుందని ఏజీ కోర్టులో అవిడవిట్ ద్వారా వెల్లడించారు.
విచారణ ముగింపు దశలో ప్రభుత్వ అభ్యర్థనను న్యాయస్థానం తోసి పుచ్చింది. చివరకు సీఆర్డీఏ చట్టంపై అసలు శాసనాధికారమే ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఒప్పందం ప్రకారం ముందుకెళ్లాలని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టం చేసింది. తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్తుందా లేక శిరసావహిస్తుందో వేచి చూడాల్సిందే