అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. బిడ్డల భవిష్యత్తు కళ్ల ముందు కదిలాడింది. ఆ తండ్రి పిల్లలతో సహా కాలువలో దూకేశాడు. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలో చోటుచేసుకుంది. రైతు చిరంజీవికి ఆరెకరాల భూమి ఉంది. దానికి మరికొంత కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. వరుసగా కొన్నేళ్లపాటు ఇవే నష్టాలు. మొత్తం రూ.20 లక్షల అప్పులు ఆ తండ్రీ పిల్లలను బలితీసుకున్నాయి.
ఇదే జిల్లాలో ఓ మిర్చి రైతును పరిస్థితులెలా ఉన్నాయని అడిగితే.. ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర దాకా నష్టపోయాం. ప్రభుత్వం నుంచి పది నుంచి పదిహేను వేలదాకా సాయం అందింది. అది ఏ మూలకు సరిపోతుంది ! జరిగిన నష్టాన్ని కనీసం బయటకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాం. తీవ్రంగా నష్టపోయినట్లు బయటకు తెలిస్తే మళ్లీ అప్పులు పుట్టవ్. కళ్లనీళ్లు దిగమింగుకొని మొహంపై చిర్నవ్వుతో నటిస్తున్నామంతే. ఇదీ రైతుల దయనీయ స్థితి.
నిన్నటి రోజునే 2022–23 సంవత్సరానికి వ్యవసాయానికి రూ.2.24 లక్షల కోట్ల రుణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో సింహ భాగం పంట రుణాల కింద ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఊతమివ్వడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుందని సీఎం వైఎస్ వెల్లడించారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
మరో వైపున వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ము చెల్లించడం లేదనేది ఓ వార్త. అందువల్లే 90 శాతం రాయితీతో సూక్ష్మ బిందు సేద్య పరికరాలను రైతులకు అందించలేకపోయినట్లు స్పష్టమవుతోంది. పంట రుణాలకు సున్నా వడ్డీ పథకానికీ గండి పడినట్లు తెలుస్తోంది. సుమారు 50 పథకాలకు రాష్ట్ర సర్కారు వాటా చెల్లించలేక చేతులెత్తేసినట్లు అవగతమవుతోంది.
ఇంకో వైపున ఆర్బీకేల్లో డ్రోన్ టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి లక్షల కోట్ల పంట రుణాలు ఏమవుతున్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎటు పోతుంది ! క్షేత్ర స్థాయిలో నష్టాల ఊబిలోకి జారుతున్న రైతన్నలకు చేరుతున్నాయా ! బలవన్మరణాలను నిలువరిస్తున్నాయో లేదా ఆలోచించాలి మరి.