అమరావతి రాజధానినే కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. నిర్దేశిత గడువులోగా ప్లాన్ ప్రకారం పనులు చేపట్టాల్సిందేనని తేల్చింది. ఎప్పటికప్పుడు తమకు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. విభజన చట్టంలోని క్లాజులను ఉదహరిస్తూ ‘ది న్యూ క్యాపిటల్’ అంటే ఒక్కటే రాజధాని అని ధర్మాసనం స్పష్టం చేసింది. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు సీఆర్డీఏపై తదుపరి శాసనం చేసే అధికారం శాసన సభకు లేదని కుండబద్దలు కొట్టేసింది. మరి ఇప్పుడేం చెయ్యాలి !
హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ తో మంత్రులు బొత్సా, బుగ్గన, సలహాదారు సజ్జల భేటీ అయ్యారు. సుప్రీం కోర్టుకు అప్పీలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా లోతుగా చర్చించారు. సుప్రీంలోనూ చుక్కెదురు కావొచ్చని భావించినట్లు తెలుస్తోంది. కాకుంటే న్యాయస్థానం విధించిన గడువులోగా పనులు ఎలాగూ పూర్తికావు. నిధుల కొరత గురించి.. రాష్ట్ర ఆర్థిక దుస్థితి గురించి కోర్టుకు వెల్లడించి సమయం కోరవచ్చు.
ఓ ఏడాదిపాటు ఇలాగే కాలం నెట్టుకొస్తే.. తర్వాత ముందస్తు ఎన్నికలకు పోవచ్చు. మూడు రాజధానులు తాము తీసుకొస్తామన్నా హైకోర్టు వీలు కాదని ఆదేశించింది. దీని వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందని చొప్పొచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో మళ్లీ ప్రజామోదం పొందొచ్చు.
హైకోర్టు తీర్పు అలాగే ఉంటుంది. అందుకనుగుణంగానే ముందుకు పోవాలి. అప్పుడైనా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాల్సిందే. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందానికి కట్టుబడక తప్పదు.
మరోసారి శాసన సభలో మూడు రాజధానుల బిల్లు పెట్టి చట్టం చేసినా అది న్యాయ సమీక్షలో నిలవదు. ఏదైనా మార్పులు చేసే అధికారం పార్లమెంటుకే ఉందన్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంటులోనే మూడు రాజధానులకు ఆమోదం చేయిస్తారా !
అందుకు కేంద్ర పెద్దలు అంగీకరిస్తారా అంటే అనుమానమే. ఈపాటికే అమిత్ షా అమరావతి రాజధానికి తాము కట్టుబడి ఉన్నట్లు ఎప్పుడో చెప్పేశారు. రాజధాని రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చారు. అందువల్ల ఇదీ సాధ్యం కాకపోవచ్చు.
ఒక్కటే మార్గం కనిపిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి రాజధాని రైతులకు నచ్చజెప్పాలి. దశలవారీ భూముల అభివృద్ధికి భరోసానివ్వాలి. అది ఆచరణలో చూపించాలి. రాజధానితోపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తెచ్చి రైతులను ఒప్పించాలి.
ప్రతిపక్షం రాజధానిగా ప్రకటించినా అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. తాము నిర్మించేది తాత్కాలిక రాజధాని కాదు. శాశ్వత రాజధాని అని చెప్పుకోవచ్చు. దీన్ని వచ్చే ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా చేసుకొని ముందుకెళ్తే మళ్లీ అధికారానికి దారి సుగమం అవుతుంది. సీఎం జగన్ ఏం చేస్తారనేది చూడాలి మరి.