– ఏపీలో జరుగుతున్న అన్ని తప్పులకు తానే కారణమంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం నుంచి మీడ్ అండ్గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి గుండెపోటు అని ప్రచారం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పి వైసీపీని ఓడిస్తామన్నారు. సానుభూతితో జగన్ ఓట్లు వేయించుకున్నారన్నారు. వివేకా హత్య, కోడి కత్తితో సానుభూతి పొందారని, ఇప్పుడు కోడి కత్తి ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరాన్ని పరిగెత్తించి 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఉంటే ఈపాటికి 100 శాతం పూర్తయ్యేదన్నారు. పోలవరంలో అవినీతికి పాల్పడ్డామన్నారు.. నిరూపించారా? అని ప్రశ్నించారు
– రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ విధానమని హోం మంత్రి మేకతోటి సుచరిత పునరుద్ఘాటించారు. శుక్రవారం ఏఎన్‌యూలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సమావేశానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రం చెబుతోందని, రాజధానిపై శాసన నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు చెప్పిందన్నారు. దీనినిబట్టి చెప్పేవారికే స్పష్టతలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

– పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఆర్అండ్ఆర్పై కేంద్ర జలలనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ భేటీలో నిర్వాసితులకు పరిహారంపై షెకావత్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పునరావాస కల్పన కేవలం 20.19 శాతమే పూర్తికావడంపై చర్చించారు. గతంలో ఆమోదించిన ప్రాజెక్టు అంచనా వ్యయం.. రూ.55,656.87 కోట్లకు క్లియరెన్స్ ఇవ్వాలని జగన్ కోరారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవసరమయ్యే.. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలపై కేంద్రమంత్రి ఆరా తీశారు.
– వైసీపీ ప్రజా ప్రతినిధులపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ హయాంలో మందిర్, మసీదు మాత్రమే తెచ్చారని తప్పుబట్టారు. వ్యాపారస్తులు రాజకీయాలలోకి రావడం వల్లే అమరావతి కి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ మాట్లాడిన మాటలు చాలా దారుణమన్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికే ఈ సారి టిక్కెట్లు ఇవ్వాలని కోరారు.