– జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్ సీఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని తెలిపారు. త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తామని ప్రకటించారు. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాలన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని తేల్చిచెప్పారు. దేశ హితం కోసమే తమ ప్రణాళిక అని తెలిపారు. తమది ఏ ఫ్రంటో తర్వాత చెబుతామని కేసీఆర్ వెల్లడించారు.
– సీఎం కేసీఆర్‌పై ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో కేసీఆర్ పీహెచ్డీ చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులను, యువతను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దళితుల ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ మోసం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతి ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయం. దేశంలోని ప్రతి పార్టీ ఒక వ్యక్తిగత ఎజెండాతో ఉన్నాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకమైన ఫ్రంట్ దేశంలో అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు మంచి చేసే ఫ్రంట్ కావాలి. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని సోమనాథ్ ఆరోపించారు.

– రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్‌వన్‌గా నిలిసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్యత్వం చేసినవారికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ పర్యవేక్షణ కోసం పార్టీలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌కి భయపడి వ్యూహకర్త పీకేను తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనడానికి ఇదే తార్కాణమన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
– ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్ ను కల్పించడం జరుగుతుందని సీ.ఎస్. స్పష్టం చేశారు. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జీ.ఓ ఎం.ఎస్. నెంబర్ 21 తేదీ 2 .2 . 2022 విడుదల చేసినట్టు తెలిపారు, ఈ జీ.ఓ లోని పారా 7, 8 పారాల్లో పేర్కొన్న నిబంధనలను మార్పులు చేస్తూ ప్రభుత్వం జీ.ఓ. ఆర్.టి నెం. 402 తేదీ ,ఫిబ్రవరి 19న జారీ చేసినట్టు తెలిపారు.