– మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. టీడీపీ నేతలు తమకు ప్రామాణికం కాదన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని ప్రకటించారు. జిల్లాల పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఉగాదికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందని బొత్స సత్యనారాయణ ప్రకటించారు
– అమరావతి కాదు కమ్మరావతి అని మంత్రి అప్పలరాజు దుయ్యబట్టారు. 3 రాజధానులకు చంద్రబాబు మోకాళ్ళడ్డుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతివిషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఆర్డీఏ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. కానీ తమ విధానం వికేంద్రీకరణ అని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 3 రాజధానులపై సీఎం జగన్ ముందుకెళ్తారని తెలిపారు. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని అప్పలరాజు పిలుపునిచ్చారు.

– చేనేతరంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు లోకేష్ లేఖ రాశారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలన్నారు. కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని కోరారు. నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రులు జయశంకర్, జ్యోతిరాదిత్య సింధియా, హార్దిప్ సింగ్ పూరిలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలు రాశారు. రొమేనియా, హంగేరికి అదనపు విమానాలు పంపి విద్యార్థుల తరలింపు వేగవంతం చేయాలని కేంద్రమంత్రులను ఎంపీ కోరారు. సుమారు 507 మంది విద్యార్థులు రొమేనియా, హంగేరి సరిహద్దులు దాటి విమానాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఎంపీ రామ్మోహన్ నాయుడు అభినందించారు.