నేటికీ వైద్య విద్యకు క్రేజు తగ్గలేదు. తల్లిదండ్రుల ఆశల హర్మ్యాలకు పిల్లల జీవితాలు మోడువారుతున్నాయి. ఒక వయసొచ్చేసరికి ఇదేం ఖర్మరా బాబంటూ వాపోని వాళ్లుండరు. అమెరికాలో డాలర్ల ఆర్జనకు ఎగబడేవాళ్లు కొందరుంటే.. దేశంలోనే రెండు చేతులా సంపాదించవచ్చనే కోరికలతో సగం జీవితం తెల్లారిపోతోంది. తీరా చదువు పూర్తయిన వారిలో పది శాతానికి మించి ఆస్థాయికి చేరలేరు. మిగతా వాళ్లంతా డ్యూటీ డాక్టర్లుగా అరకొర వేతనాలతో నెట్టుకొస్తుంటారు. అటు పల్లెలకు వెళ్లి సేవలు చేయడం ఇష్టం లేక.. ఇటు అర్బన్‌లో జీవనాన్ని నెట్టుకురాలేక నిట్టూర్చేది ఎందరో !
దేశంలో మొత్తం 1,18,316 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ కోటాలో 85% అర్హత ప్రమాణాల నెరవేర్పుకు లోబడి నిర్దిష్ట రాష్ట్రంలోని నివాస విద్యార్థులకు కేటాయిస్తారు. నీట్ కట్-ఆఫ్ శాతంలో అర్హత సాధించిన వైద్య అభ్యర్థులు మాత్రమే అలాట్మెంట్లో పరిగణిస్తారు. దేశంలోని ప్రభుత్వ వైద్య, దంత కళాశాలలతో సహా మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 2019లో ఆల్ ఇండియా కోటా ప్రకారం 15 శాతం సీట్లు రిజర్వ్ చేశారు. నీట్ కౌన్సెలింగ్ ఆధారంగా భర్తీ చేయబడతాయి.
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అభ్యర్థులకు ఈ కోటా వర్తించదు. ఆల్ ఇండియా కోటాలో రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య సుమారు 65వేలున్నాయి. ఇది కాకుండా 2020లో చేర్చబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27, శారీరక వికలాంగులకు 3శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.

మరిన్ని సీట్లుంటే ఉద్యోగ అవకాశాలేమన్నా ఎక్కువగా ఉన్నాయా అంటే గొప్పగా లేవు. ఏటా 10,000 ఉద్యోగాలు కూడా ఉండవు. ప్రైవేటు ప్రాక్టీసు పల్లెకు పోయి చేసుకుంటారా అంటే అంత రిస్కు తీసుకోరు. పట్టణాల్లో డ్యూటీ డాక్టర్లుగా అరకొర జీతానికి కొందరు చేరతారు. మరికొందరు పీజీకి వెళ్తారు. ఇంకొందరు ఇతర దేశాలకు పోతారు.
చాలామంది ఈ చక్ర భ్రమణంలో తిరుగుతూ ఉంటారు. అందరూ పీజీ చేయలేరు. ఉద్యోగం వచ్చినా పెద్ద జీతమేమి ఉండదు. నెలకు రూ.50 వేలు వస్తే గొప్ప. ఫ్రస్టేషన్ లో పని సరిగ్గా చేయలేరు. మరలా ఉన్నత చదువులు చదవాల్సిందే.
అన్నీ కరెక్టు గా చదవగల బ్రిలియంటు స్టూడెంటయినా 30 ఏళ్లు వచ్చేస్తాయి. మామూలు వారి పరిస్ధితి నిత్య జీవన పోరాటమే. అయినా డాక్టరు వృత్తి అంటే పాత క్రేజు అలాగే ఉంది. సంపాదన పెద్దగా ఉండదు. రిస్కు లెక్కువ. ప్రతి ఒక్కరూ చరకుని మాదిరి ఉచితంగా చూడాలంటారు. బాగా సంపాదనేమి ఉండదు.
గొప్ప సంపాదన పదిశాతం వైద్యులకుంటే గొప్ప.. వేళా పాలా ఉండదు. సగం యవ్వనం చదువులోనే హరిస్తుంది. పెళ్ళి చేసుకొని జీవితం సంతోషంగా గడిపేది తక్కువ . కొంత స్ధిరత్వం వచ్చే లోపలే బాధ్యతలు, పొట్ట, బట్టనెత్తి వచ్చేసి జీవితం అటకెక్కుతుంది.
ఒక వేళ కూతురు చాలా మేధస్సు కలదయి ఎండీ, డీఎం చదివితే మళ్లీ అంతవాడిని తెచ్చిచేయాల. కట్నాలెక్కువ. ఎంబీబీఎస్ చేసినోడిని చేసుకోరు. నాకు తెలిసిన హెల్తు ఎంప్లాయి కూతురు కు పెళ్లి చేసేందుకు అష్ఠకష్ఠాలు పడుతున్నాడు. బాగా చదివి గోల్డుమెడల్ తెచ్చుకున్న అమ్మాయిలకయితే మళ్లీ అంతటోడే కావాల. తల్లితండ్రులకు ఇక మెంటలే. అబ్బాయిలు అమెరికా పోతే అక్కడ గ్రీన్ కార్డు వాళ్లు సెట్ కారు. కల్చరల్ గ్యాపు. మరలా సంబంధాలు కష్ఠం. ఒక వేళ పెళ్లయి పిల్లలు పుడితే మళ్లీ అదో పెద్ద ప్రహసనం.

దీంట్లో లొసుగులు తెలియక ఉక్రెయిను, ఫిలిప్పయినూకు వెళ్తారు. ఆ వానాకాలం చదువులు చదివొచ్చి పదిశాతం కూడా ఎంట్రీ టెస్ట్ పాసవరు. ఈడ చదివినోళ్లకే ఉద్యోగాల్లేవు. వీళ్లకు ఉద్యోగం రావడం కష్ఠం. పీజీ సీట్లకు కొందరు పోటీ పడతారు. ఆటికాటికే వస్తాయి. ఇక్కడ వాళ్లతో పోటీపడలేరు.
మళ్లీ కొందరు సివిల్సు అని కొన్నాళ్లు చదివి ఒకరో ఇద్దరో సక్సెసు అయినా చాలామందికి రాదు. రెంటికీ చెడ్డ రేవడవతారు. మా పిల్లలు వైద్య విద్య చదువుతున్నారని పేరెంట్సు సంబడమే తప్పితే చదివినోడికి పులుసు కారిపోద్ది.
అయినా ఈ కార్పొరేట్ కళాశాలలు ఒకటో తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులని ఊదరగొట్టి దోచుకుంటాయి. ఆశలపల్లకిలో ఊయలలూగిస్తారు. పిల్లలు డాక్టరు అయినట్లు, నర్సింగ్ హోమ్ పెట్టినట్లు, మెడికల్ షాపు, ల్యాబు అన్ని పెట్టి అజమాయిషీ చేసి కోట్లు సంపాదించాలని తలిదండ్రులు రంగుల కలలు కంటారు. అంతే ! జీవితచక్రం మొదలవుతుంది. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేటి వాస్తవిక తీరుతెన్నులు తెలుసుకుంటే కాని ఈ పరిస్ధితులు మారవు. వైద్య జీవన చక్రం ఆగదు.
సేకరణ : RK Chinnam FB wall నుంచి