వైసీపీ వెయ్యి రోజుల పాలన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇదే సందర్భంగా అనేక వర్గాల నుంచి వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఉద్యోగులు.. ఉపాధ్యాయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కౌలు రైతులు కువకువలాడుతున్నారు. నిర్మాణ రంగ కార్మికులు నిరాశా నిస్పృహల్లో నలుగుతున్నారు. ఆయిల్ నుంచి నిత్యావసరాలు, మద్యం ధరల పెంపుతో సగటు ప్రజల జీవన వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దీనికి తోడు పేద, మధ్య తరగతి ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. ఈ ప్రభావంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తమవుతోంది.
ఇంతే కాదు. జిల్లాల విభజన అధికార పార్టీలో అసంతృప్తి సెగలను రాజేసింది. ఈపాటికే గ్రామం నుంచి జిల్లా స్థాయి నాయకుల దాకా మనసులో రగులుతున్నా ఉగ్గబట్టుకొని ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు సరైన గుర్తింపు లేకుండా చేశారని పార్టీ క్యాడర్లో బలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏదైనా పని ఇస్తారని ఆశ పడ్డారు. ఆపాటికే చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు కొరకొరమంటున్నారు.
సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అప్పటికే మంజూరైన పనులన్నింటినీ నిలిపేశారు. 25 శాతం పనులు జరిగినవీ ఆగిపోయాయి. అక్కడ నుంచి ఏ శాఖ లోనూ నిధుల్లేవ్. చివరకు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు సైతం తామేం చేయలేమని, తమ చేతుల్లో ఏమీ లేదని పెదవి విరుస్తున్నారు.
కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుందని గ్రామ సర్పంచులు గుర్రుగా ఉన్నారు. స్థానిక సంస్థలకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయలేకపోవడంతో తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆయా ప్రజా ప్రతినిధులు మింగలేక కక్కలేక పోతున్నారు. ఇలా అనేక వర్గాలు అధికార పార్టీపై విముఖంగా ఉన్నారు.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నాయకత్వం వరుస ఎన్నికల్లో ఓటమితో చెల్లాచెదురైంది. కార్యకర్తల్లో నిస్తేజం అలుముకుంది. అధికారాన్ని కోల్పోయిన ఉక్రోషం నుంచి బయటపడలేక సతమతమైంది. అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తిగత దుర్భాషలతో నాయకులు రెచ్చిపోయారు. దీంతో అనివార్యంగా కేసులు.. అరెస్టులు కొనసాగాయి. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో కాస్త కదలిక వచ్చింది.
అక్కడ నుంచి చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఇప్పుడు అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పుతో ఉత్సాహంతో ఆ పార్టీ శ్రేణులు కదులుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. లోపాలను సరిదిద్దుతూ ముందుకెళ్తున్నారు. మొత్తంగా టీడీపీ యంత్రాంగంలో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారు. రానున్న రెండేళ్లలో తిరిగి ప్రజల మద్దతు పొందేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నారు.