పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక ఎత్తి చూపిందట. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో తప్పటడుగులు. అనర్హులకు జగనన్న చేదోడు సొమ్ములు. రష్యా–ఉక్రెయిన్ వార్ కారణం చూపి వంట నూనెల ధరలు పెంచుతూ వ్యాపారుల బరితెగింపు. ఇంతలా తప్పుల మీద తప్పులు దొర్లుతున్నాయంటే.. రాజు అంత:పురానికే పరిమితం కావడం ఓ కారణం. కేవలం వంది మాగధుల భజనతో నిర్ణయాలు తీసుకోవడం మరో కారణం. ఇప్పటికైనా విశేష ప్రజాదరణ కలిగిన సీఎం వైఎస్ జగన్ మరోసారి ప్రజల్లోకి రావాలి. గత మూడేళ్లలో తన పాలనపై జనాభిప్రాయాన్ని తెలుసుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. అందుకు సిద్ధమేనా సార్ !
ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి అశుతోష్ మిశ్రా నివేదికలో ఏముందో సీఎంకు నివేదించిన వాళ్లకే తెలియాలి. రెండు నెలల తర్వాత విడుదల చేసిన నివేదికను ఉద్యోగ సంఘాలు మదింపు చేశాయి. 27 శాతం ఫిట్ మెంటు ఇచ్చినా.. 30 శాతం హెచ్ఆర్ఏ కొనసాగించినా.. మిగతావన్నీ యథాతధంగా అమలు చేసినా ప్రభుత్వానికి అదనంగా పడే భారం కేవలం రూ.3,181 కోట్లు. దీనికి భిన్నంగా రూ.9,645 కోట్ల భారం పడుతుందని సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టించారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న 23 శాతం ఫిట్మెంటు, హెచ్ఆర్ఏ స్లాబులు, ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి ఒక్క రూపాయి భారం పడే అవకాశం లేదు. ఈమాత్రం దానికి 14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేట్లు చేసుకున్నారు. రోడ్డు మీదకొచ్చి ఆందోళనలు, నిరసనలు, బంద్‌లు దాకా వెళ్లేట్లు చేశారు. చివరకు ఉత్తుత్తి పీఆర్సీ ఇచ్చారనే అపవాదును మూట గట్టుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధి వ్యాపారులకు సాయంగా అందించే జగనన్న చేదోడు సొమ్ములు రూ.60 కోట్లు అనర్హులకు చేరిపోయాయి. అర్హుల జాబితా.. అనర్హుల జాబితా క్కూడా డబ్బు ఇచ్చిన ఘనాపాటీలు మన అధికారులు. మరోవైపున రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి వ్యాపారులు వంట నూనెల ధరలు అనూహ్యంగా పెంచేశారు. తామేం చేసినా చెల్లుబాటవుతుందనే ధీమాతోనే వ్యాపారులు ఇలా బరి తెగించారు.
చివరకు అక్కడక్కడా జిల్లాల్లో అధికారులు దాడులు చేసినా నామమాత్రమే. ప్రజలను జలగల్లా పీల్చేస్తున్నారంటే ప్రభుత్వం వాళ్ల పట్ల క ఠినంగా లేదనే భావన కలుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ధరలను అదుపులోకి తేవాలి. వీటన్నింటి దృష్ట్యా సీఎం వైఎస్ జగన్ మరో యాత్ర చేయాల్సిన అవసరముంది. ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి సరిదిద్దుకుంటారని ఆశిద్దాం.