సినీ హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజం. అందులో జనసేనాని పవన్ కల్యాణ్ అభిమానులు ప్రత్యేకం. వాళ్లలో ఓ మిలిటెన్సీ ఉంటుంది. ఓ పిలుపునిస్తే అందుకొని నిస్వార్థంగా పనిచేసే తత్వం వాళ్ల సొంతం. ఇటీవల రాయలసీమ వరదల్లో జన సైనికుల సేవలే అందుకు నిదర్శనం. అంతటి అభిమానాన్ని ఓట్ల రూపంలో మల్చుకోవడంలో పవన్ కల్యాణ్ బాగా వెనకబడ్డారు.‘ఇక్కడ పవర్ స్టార్ అంటూ జేజేలు పలుకుతారు. ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారు !’ అంటూ ఇటీవల అనేక సందర్భాల్లో పవన్ కల్యాణ్ వాపోయిన సంగతి తెలిసిందే. ఈనెల 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభ జనసేన పార్టీకి దిక్సూచి అవుతుందా !
గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. పార్టీ అధ్యక్షుడే రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఒకే ఒక్క సీటు గెల్చుకున్నా.. తర్వాత ఆ ఒక్కరూ నిలవలేదు. ఓ రాజకీయ లక్ష్యం.. అందుకు తగ్గ పార్టీ కార్యక్రమం లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ప్రజా సమస్యలపై అడపాదడపా పవన్ నిరసన సభలు, యాత్రలు చేయడం మినహా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం లేదు. నిరంతరం ప్రజల్లో ఉండేందుకు ఎలాంటి కార్యాచరణను కార్యకర్తలకు ఇవ్వలేకపోయింది.
ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమంతో మళ్లీ జనసైనికుల్లో కదలిక వచ్చింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కమిటీలు వేశారు. అంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ శ్రేణులను కదిలించే ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. లోపభూయిష్టమైన కౌల్దారీ చట్టంతో కౌలు రైతులు ఎలాంటి సాయం అందక కునారిల్లుతున్నారు. మిర్చి, పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు.
కరోనా తర్వాత చిరుద్యోగులు, చిరు వ్యాపారుల జీవితాలు ఇంకా గాడిన పడలేదు. ఇసుక, సిమెంటు, స్టీల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైంది. కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. నిరంతరం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆక్రోశం అంతాఇంతా కాదు.
ఈ సమస్యలపై జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషించలేకపోయింది. ఏదైనా సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు ప్రజా పోరాటాలకు వెన్నుదన్నుగా నిల్చినప్పుడే ఆ పార్టీ ప్రజల్లో ప్రభావవంతంగా నిలుస్తుంది. ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు దగ్గర నుంచి అధినాయకత్వం లోపం కనిపిస్తోంది.

కనీసం పార్టీ ఆవిర్భావ సభలోనైనా పార్టీ విధి విధానాలపై లోతయిన చర్చ జరగాలి. పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రేణులకు నిర్దేశించాలి. స్థానిక సమస్యలపై పార్టీ చొరవ మరింత పెరగాలి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉండాలి.
అమరావతిలో తలపెట్టిన ఆవిర్భావ సభ ఏర్పాట్లకు మొత్తం 12 కమిటీలు వేశారు. వీటితోపాటు రాజకీయ తీర్మానాల కమిటీ కూడా ఏర్పాటయింది. ఇదే జనసేన పార్టీ భవిష్యత్తును నిర్దేశించనుంది. ఏం తీర్మానాలు చేస్తారు.. వాటిని ఎలా అమలు చేస్తారనేది ఆ పార్టీ విజయంపై ఆధారపడి ఉంటుంది.