యూపీలో మాదిరి తెలంగాణలోనూ డబుల్ బుల్ డోజర్‌తో ఢీ కొడతాం. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ రెట్టించిన ఉత్సాహంతో వెల్లడించారు. తెలంగాణలోని కమలనాధులంతా అధికారానికి వచ్చేసినట్లే సంబురాలు జరుపుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమేనని తేల్చి పారేశారు. బీజేపీ ప్రత్యర్థి టీఆర్స్సేనని చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ కూడా బీజేపీనే టార్గెట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి కాషాయ నేతల అభీష్టం నెరవేరుతుందా !
వాస్తవానికి హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ లేకుంటే బీజేపీ పెరుగుదలకు ఏ మాత్రం అవకాశం లేదు. తెలంగాణ ప్రజల జీన్స్‌లోనే ఉద్యమ నేపథ్యం ఉంది. సమస్యలపై స్పందించే తత్వం ఎక్కువ.
తప్పు మనవాడు చేసినా తుక్కు రేగ్గొట్టాల్సిందేననే నిజాయతీ ప్రజల్లో బలీయంగా ఉంటుంది. తెలంగాణ చరిత్రలో ఇలాంటి వాటికి ఎన్నో నిదర్శనాలున్నాయి. కులాల వారీ సమీకరణ కూడా ఇక్కడ కష్టమే.
ఇలాంటి ఉద్యమ తెలంగాణలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతాల వారీ సమీకరణ అంత తేలిక్కాదు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే లక్షణం లేని బీజేపీ కల నెరవేరడం కష్టం. అధికార టీఆర్ఎస్పై ప్రజలకు విరక్తి పుట్టి.. అవతల కాంగ్రెస్ దాన్ని అందిపుచ్చుకోలేని దశలో ఉంటే కమలనాధుల కోరిక నెరవేరొచ్చు. ఇక్కడ మజ్లిస్ పార్టీ ఎంత ఎక్కువగా ప్రభావం చూపితే బీజేపీకి అంత లాభం చేకూరుతుంది.
ఇక ఏపీలో అయితే ఇక్కడ అధికార ప్రతిపక్షాలు బీజేపీ దయాదాక్షిణ్యాల కోసం అర్రులు చాస్తున్నాయి. జనసేన పార్టీ మిత్ర పక్షంగా కొనసాగుతోంది. అందువల్ల కమలనాధుల ప్రయోజనాలు నెరవేర్చడానికి ప్రధాన పక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు కాషాయ నేతల ఎత్తుగడల ప్రకారం వీళ్లను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు.
అప్పటికీ అవసరమనుకుంటే రెండు ప్రధాన పక్షాలపై డబుల్ బుల్డోజర్ను గురిపెడితే ఏదో ఓ పక్షం బీజేపీలో కలిసిపోతుంది. అందువల్ల అంత తొందరపడాల్సిన అవసరం లేదు. బీజేపీ సెగ తెలంగాణకే పరిమితం కావొచ్చు.