గతం కన్నా కొన్ని సీట్లు తగ్గినా యూపీలో బీజేపీ హవా కొనసాగింది. ఉత్తరాఖండ్‌లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గోవా, మణిపూర్‌లో మేజిక్ ఫిగర్ తెచ్చుకోలేక తంటాలు పడింది. పంజాబ్‌లో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఆప్ చీపురుతో ఊడ్చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. భవిష్యత్తులో బీజేపీ వర్సెస్ ఆప్ అనేట్లు పోరు ఉండొచ్చని తెలుస్తోంది.
యూపీలో యోగి సర్కారు అరాచకాలను ప్రపంచం మొత్తం చూసింది. అయినా అక్కడ తనకు తిరుగులేని మెజారిటీని నిలబెట్టుకుంది. ఎన్నికల ఎత్తుగడలు.. ప్రజలను సమీకరించడంలో సమాజ్‌వాది పార్టీ ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్, బీఎస్సీ సోదిలో లేకుండా పోయాయి. గోవాలో బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ మరోసారి వైఫల్యం చెందింది.
గతంలో ఉన్న కాంగ్రెస్ స్థానాలను తృణమూల్ కాంగ్రెస్, స్వతంత్రులు లాగేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి వచ్చిన సీట్లలో సగం మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. మణిపూర్‌లో బీజేపీ కన్నా స్వతంత్రులే ఎక్కువ స్థానాలు గెల్చుకున్నారు. ఇక్కడా కాంగ్రెస్ పేలవంగానే మిగిలిపోయింది.
ఇప్పుడు బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనే సత్తా ఉంది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌ను ఏ విధంగా అయితే మట్టి కరిపించారో.. అదే దూకుడును పంజాబ్‌లో ప్రదర్శించింది. తమకు తిరుగులేదనుకున్న నేతల తలరాతలను ఆప్ తిరగరాసింది.
ఆప్ జైత్ర యాత్ర పంజాబుకే పరిమితం కాదు. తర్వాత హర్యానా, గుజరాత్లో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. మొన్నటి గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో 30 కార్పొరేషన్లను ఆప్ కైవసం చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ ఇచ్చిన విజయంతో బీజేపీకి పక్కలో బల్లెం చీపురు పార్టీయేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికిని కోల్పోతున్న దశలో వామ పక్షాలు తగినంతగా పుంజుకోలేదు. దీంతో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రత్యామ్నాయం కాజాలవనే నానుడి ముందుకొచ్చింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదిరించగల సత్తా ఒక్క ఆప్‌కు మాత్రమే ఉందని తేలిపోయింది.
ఆప్ విజయం ప్రాంతీయ పార్టీలకు ఓ దిక్సూచిలా మారింది. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్లో మమత, తమిళనాట స్టాలిన్, కేరళలో విజయన్ ప్రభుత్వాలకు పంజాబ్‌లో ఆప్ విజయం భవిష్యత్ రాజకీయ సమీకరణలకు ఓ చోదక శక్తిగా నిలువనుంది.