దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతమైనట్టేనా? 130 ఏళ్ల చరిత్ర ఉన్న హస్తం పార్టీ పూర్తిగా అవసాన దశలోకి వెళ్లిందా? అంటేఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అత్యంత కీలకంగా భావించిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా గట్టిపోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది రాహుల్ టీమ్.
యూపీలో గెలుపుపై ఆశలు లేకపోయినా.. ఉనికిని చాటుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్ర ఓటర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. ఒకప్పుడు యూపీని శాసించిన కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రియాంకా గాంధీకి బాధ్యతలు తీసుకొని కాలికి బలపం కట్టుకొని తిరిగినా ఫలితం దక్కలేదు. సోనియాగాంధీ సొంత నియోజకవర్గం రాయ్ బరేలీ పరిధిలో కూడా ఆ పార్టీ దారుణంగా చతికిలపడింది.
అధికారంలో ఉన్న పంజాబ్ లో ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. ఏకంగా సీఎం చన్నీయే పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలయ్యాడు. పీసీసీ చీఫ్ సిద్ధూ తో పాటు మెజార్టీ మంత్రుల్ని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తీశాయి. స్టేట్ కాంగ్రెస్ ను కంట్రోల్ చేయడానికి పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు మొదటికే మోసం తెచ్చాయి.
ప్రజల్లోఇమేజ్ ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ను దూరంచేసుకోవడం.. ప్రజాదరణ లేని చన్నీని సీఎం చేయడం.. సిద్ధూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగిపోవడం.. పంజాబ్ లో ఆపార్టీని భూస్థాపితం చేశాయి. రాహుల్, ప్రియాంక పరిపక్వత లేని నిర్ణయాలు తీవ్ర నష్టం చేకూర్చాయని అంటున్నారు.
ఉత్తరాఖండ్ లో పోటా పోటీ ఉంటుందని అంచనాలొచ్చినా ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రాహుల్ గాంధీ ఎంత ప్రచారం చేసినా గత ఎన్నికల్లో పోలిస్తే కొన్ని సీట్లు పెరిగాయే తప్ప అధికారం మాత్రం దక్కలేదు. ఏకంగా మాజీ సీఎం హరీష్ రావత్ ఓటమిపాలయ్యాడు. ప్రజల నుంచి సానుకూలత ఉన్నా కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. క్యాడర్ తో పాటు పైస్థాయి నేతలు కూడా గట్టిగా పోరాడకపోవడంతో మరోసారి రాష్ట్రంలో అధికారానికి దూరమైందనే చర్చ జరుగుతోంది.
గోవాలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా జనం కాంగ్రెస్ వైపు మాత్రం మళ్లలేదు. ఆ పార్టీ జనంలో భరోసా కల్పించలేకపోయింది. హోరాహోరీ తప్పదనుకున్న పోరు ఏకపక్షమైంది. బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. మణిపూర్ లోనూ అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మొత్తంగా ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీకి కాంగ్రెస్ ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.