బాహుబలి రెండు పార్టులతో దేశవ్యాప్తంగా ఏ హీరోకూ లేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కోసం చాలామంది హీరోలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నా.. ఎవరూ పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. బాలీవుడ్ హీరోలకు హిందీ బెల్టు, హైదరాబాద్ వంటి అక్కడక్కడి థియేటర్లు తప్పితే సౌత్ లో పెద్దగా కలెక్షన్లుండవు. ఇక సౌత్ హీరోలు దక్షిణాదిలో ఎంత ప్రయత్నించినా అక్కడి ఖాన్ త్రయాన్ని ఎదుర్కొని నిలబడటం, హిందీ ఆడియన్స్ కు నచ్చటం రెండూ చాలా కష్టం. ధనుష్ వంటి అద్భుతమైన నటుడు సైతం హిందీలో పూర్తిగా నిలదొక్కుకోలేకపోయాడు.
చిరంజీవి, నాగార్జున వంటివారూ బాలీవుడ్ లో ఓ చెయ్యేసి వెనక్కి వచ్చేశారు. మొన్నామధ్య రామ్ చరణ్ కూడా జంజీర్ పేరిట ట్రై చేశాడు. కుదరలేదు. కానీ.. ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకుండానే ప్రభాస్ కు ఆ అదృష్టం దక్కింది. అయితే ఏదో సామెత చెప్పినట్లుగా.. మొదటి స్థానానికి చేరుకోవడం కంటే ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే అత్యంత కష్టం.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రభాస్ తెలియని సినీ అభిమానులు లేరంటే అతిశయోక్తి లేదు. ఈ క్రేజే ఇప్పుడు ప్రభాస్ కు ఇబ్బందిగా మారింది. అన్ని వర్గాలు, రాష్ట్రాలు, భాషల ప్రేక్షకులను సంతృప్తిపరిచే సినిమాలను తీయాలన్న ఆరాటంతో ఫ్లాపుల్ని కొనితెచ్చుకుంటున్నాడు.
పాన్ ఇండియా హీరో ఇమేజ్ అంటే మాటలు కాదు. సినిమాను డబ్ చేసి ఎన్ని భాషల్లో విడుదల చేసుకుంటే అంత కలెక్షన్. ఓ మాదిరిగా బాగుందని టాక్ వచ్చినా.. తక్కువలో 200 కోట్లు వసూలవుతాయి. అందుకే అటువంటి హీరో సినిమాకు బడ్జెట్ ను కూడా భారీగా పెట్టొచ్చు. రిచ్ గా సినిమాను తెరకెక్కించొచ్చు. అదంతా ఒకే కానీ సినిమాలో కథ కూడా బాగుండాలి. లేదంటే రాధే శ్యామ్ లా అవుతుంది పరిస్థితి.

ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్, క్రేజ్ ఎటువంటి సినిమాతో వచ్చిందో ఒకసారి పరికించి చూస్తే.. డైరెక్టర్ రాధాకృష్ణ అండ్ కో.. రాధే శ్యామ్ ను ప్రభాస్ తో రిస్క్ చేసి ఉండేవారు కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు కేజీఎఫ్ తరహా సినిమా పడితే.. తన ఇమేజ్ మరింతగా బలపడి ఉండేది. అందుకు విరుద్ధంగా తనను ఊరమాస్ గా కాక.. లవర్ బాయ్ లా చూపించే సినిమాలను డార్లింగ్ ఎంచుకుంటున్నాడు. ఇదే తనకు దెబ్బ కొడుతోంది.
ఇక బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ మీసాలు కూడా తీసేస్తుండటంతో తన ముఖం చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది. ప్రభాస్ మంచి మనస్తత్వం, అజాత శత్రువువంటి వైఖరి కారణంగా రాధేశ్యామ్ పై టాక్ నెగెటివ్ వచ్చినా ట్రోలింగ్ జరగలేదు. అదే మరో హీరోకు ఇలాంటి సినిమా పడి ఉంటే.. నెట్టింట కచ్చితంగా ఆడేసుకుని ఉండేవారేమో.
ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునేది ఒకటే. బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకుని ఒత్తిడిలో పడకుండా.. పూర్తి మాస్ సినిమాలు చేయాలి. తనకున్న ఇమేజ్ మేరకు, సినిమా బాగుంటే బాలీవుడ్ లోనూ హిట్ అవుతుంది. అంతే తప్ప.. అన్నింటి గురించీ ఆలోచించి.. మొదటికే మోసం తెచ్చుకోకూడదు. ఫేస్ బుక్, ట్విటర్లలో ఇదే ప్రభాస్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న ఆందోళన.
సినిమాలు, కథల ఎంపికలో ప్రభాస్ కు ఎవరైనా చెప్పాలంటూ డార్లింగ్ అభిమానులు మొత్తుకుంటున్నారు. మరి కేజీఎఫ్ దర్శకుడు నీల్ తో ప్రభాస్ సలార్ సినిమాను చేస్తున్న నేపథ్యంలో.. ఆ సినిమా అయినా ప్రభాస్ ను తిరిగి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేస్తుందేమో చూడాలి.