‘సినిమాలో ఓ హృదయ విదారక సన్నివేశాన్ని చూసి మన కళ్లు తడిదేరతాయి.
గుండె బరువెక్కుతుంది.
ఎందుకంటే మనమూ మనుషులమే కదా !
జీవన పయనంలో ఎందరో అభాగ్యులు మనకు తారసపడుతుంటారు.
కొందరు అయ్యో పాపం అంటూ కొద్దిసేపు బాధపడతారు.
మరికొందరు తోచిన సాయం చేస్తుంటారు.
అలాంటి ఘటనలకు స్పందనే నాలో స్ఫూర్తి నింపింది !’
అంటూ దాసరి లక్ష్మీ సంధ్య వ్యక్తం చేశారు.
మూడు పదుల వయస్సు దాటని ఆమెలో సేవా గుణం ఆచరణ రూపం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో ఆమె తల్లి మరణించారు. ఆ బాధ నుంచి కోలుకున్నాక నలుగురికి సాయం చేయలేని జీవనం కూడా ఒక జీవితమేనా అనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు తన ఆలోచన గురించి చెప్పారు. 2020 జనవరిలో ‘అమ్మ దాసరి వెల్ఫేర్ అసోసియేషన్’పురుడు పోసుకుంది. అప్పటి నుంచి అభాగ్యులు.. అన్నార్తుల సేవలో తరిస్తున్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బెస్తవానిపాలెంలో సంస్థను నెలకొల్పారు. ప్రతీ రోజు మధ్యాహ్నం రోడ్డు పక్కన కనిపించే యాచకులకు ఆహారం అందిస్తున్నారు. మురికివాడలకు వెళ్తుంటారు. వయసుడిగి పోయి కష్టం చేసుకోలేని వృద్ధులకు నిత్యావసరాలు అందిస్తుంటారు.
ఏ ఆదరువు లేని నిరుపేదలకు దుస్తులు, నిత్యావసరాలతోపాటు కొంత నగదు సాయం చేస్తున్నారు. అనారోగ్యంతో కునారిల్లుతున్న నిరుపేదల ఆస్పత్రి ఖర్చులు భరిస్తున్నారు. అప్పుడప్పుడూ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ నిరుపేద గిరిజనులకు వైద్య సదుపాయం కల్పిస్తుంటారు.

దాసరి లక్ష్మీ సంధ్య బీటెక్ చదివారు. కొన్నాళ్లు హెచ్ఎస్ బీసీ కమర్షియల్ బ్యాంకులో క్లయింట్ సర్వీస్ సెక్రటరీగా పనిచేశారు. ఆ ఉద్యోగం కూడా ఆమెకు సంతృప్తినివ్వలేదు. ప్రస్తుతం అమ్మ దాసరి వెల్ఫేర్ అసోసియేషన్కే పూర్తి కాలం వెచ్చిస్తున్నారు.
‘మా కుటుంబం.. బంధువుల సహకారంతో ఇవన్నీ చేస్తున్నా ! ఎవరి నుంచి విరాళాలు అడగదల్చుకోలేదు. ప్రభుత్వ సాయాన్ని కోరాలని కూడా అనిపించలేదు ! అసమానతల ప్రపంచంలో మనిషిగా తోటివారికి సాయం అందించడం ఎంతో సంతోషాన్నిస్తోంది!’అంటూ లక్ష్మీ సంధ్య చిర్నవ్వుతో చెప్పారు. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్న లక్ష్మీ సంధ్య లైఫ్ స్టయిల్ నిజంగా సమ్ థింగ్ స్పెషల్ !