లక్షలాది మంది అభిమానుల కరతాళ ధ్వనులు. ప్రాణాలను లెక్క చేయనంత ప్రేమ. అంతమంది పెను కేక పెడితే ఎలాంటి ప్రభుత్వాల్లోనైనా వణుకు పుట్టాలి. అదేంటోమరి. అధికార వైసీపీ ప్రభుత్వంలో చీమ కుట్టినట్టు కూడా లేదు. లోపం ఎక్కడుందబ్బా అంటూ బోలెడు మంది బుర్ర గీక్కుంటున్నారు. అసలు విషయమంతా జనసేనాని మాటల్లోనే వ్యక్తమైంది. ఈయన కమలాబాయి సంధించిన మరో పువ్వని తెలుస్తోంది. అందుకే వైసీపీలో స్పందన లేదు.
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. మిగతా పార్టీలు వ్యక్తిగత ప్రయోజనాలు వదులుకొని ముందుకు రావాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావ సభ పిలుపునిస్తుందన్నారు. అందుకు ఏం చేయాలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయలేదు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏంటో సెలవియ్యలేదు.
ఇదంతా చూస్తుంటే.. రాబోవు ఎన్నికల నాటికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్న ఉత్సుకత కనిపిస్తోంది. పోనీ అప్పుడన్నా జనసేనాని సీఎం అవుతారన్న సంకేతాలేమీ కనిపించడం లేదు. అంటే దీనర్థం సీఎం ఎవరనేది పైవాడు సీల్డు కవర్లో పంపిస్తారనేమో. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటి సీల్డు కవర్ల సంస్కృతి ఉండేది. మళ్లీ అలాంటి ప్రక్రియను తీసుకురావాలనే ఆలోచనేమో.
సరే.. ఇవన్నీ పక్కన పెడితే ఈపాటికే వైసీపీ, బీజేపీ పెద్దల బంధం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. నేటికీ కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే రాష్ట్ర సర్కారు నెట్టుకొస్తున్న సంగతి అందరికీ ఎరుకే. వాళ్ల మధ్య ప్రేమానుబంధానికి బ్రేక్ పడుతుందనే ఆశతో పవన్ ప్రసంగం చేశారనిపిస్తోంది.
ఏపీకి సంబంధించి బీజేపీ పెద్దలు రెండు కళ్ల ఎత్తుగడలను ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నారు. ఒకరికి చెయ్యిచ్చి మరొకరికి కన్ను గీటుతుంటారు. పాపం.. జనసేనానికి ఇది అవగతమైనట్టు లేదు. అందుకే ఏవేవో ఆలోచనలు.. రోడ్డు మ్యాపులపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
మూడు లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలున్నారు. లక్షలాది మంది అభిమానులున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చెయ్యాలనే ఒక్క అంశంపై జనసేనాని క్లారిటీ ఇవ్వలేకపోయారు. వాళ్లకు ఒక దిశా నిర్దేశం చేయలేకపోయారు. వ్యవస్థలో లోపాలను ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ అధినేతకు ప్రశ్నలేవో.. సమాధానాలేవో అర్థమైనట్లు లేదు.

బీజేపీతో చెలిమి చేసిన వాళ్ల పరిస్థితేంటో కనీసంగా గుర్తించిన దాఖలాలు కూడా లేవు. పొరుగునున్న ఉద్దవ్ థాకరేకి జ్ఞానోదయమైంది. ఆయన బొట్టు ఈయనకు వచ్చినట్టుంది. మొత్తంమీద పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లిన వాళ్లు పిచ్చిపట్టి దుస్తులు చించుకోకుండా క్షేమంగా ఇంటికి చేరినందుకు జనసేనానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.