కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీమ ప్రజలు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఎందుకంటే రాయలసీమ రణభేరి సభలో కొన్ని వాస్తవాలు చెప్పారు. ఎందరు ముఖ్యమంత్రులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినా సీమ కరవు.. పేదరికాన్ని ఎవరూ పట్టించుకోలేదని సెలవిచ్చారు. నిజాలు చెప్పినందుకు అభినందనలు. మరి సుమారు ఎనిమిదేళ్ల నుంచి ఎన్డీయే ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. ఇప్పటిదాకా యాది రాలేదా అని సీమ జనం అడుగుతున్నారు సార్ !
పోనీ రాష్ట్ర విభజన హామీల్లో సీమకు సంబంధించి ఎన్ని నెరవేర్చారో చెప్పగలరా ! కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర సర్కారు ఏర్పాటు చేయాలి. చేశారా ! అది చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భాగస్వామ్య కంపెనీ కోసం ఎదురు చూస్తోంది. కేంద్రం బాధ్యతను మరిచిందా లేదా ! ఉక్కు కర్మాగారం నెలకొల్పి దానికి సొంత మైన్స్ సమకూర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే కదా ! ఇదెలా మరిచారు భయ్యా !
విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదాకు మంగళం పాడింది మీరే కదా ! విడిపోయిన రాష్ట్రం ఆర్థిక అవస్థల్లో ఉంటే ఇతోధికంగా ఆదుకోవాలి. పోలవరం ప్రాజెక్టు అంచనా విషయంలో రాష్ట్ర సర్కారును ఇప్పటికీ నానా తిప్పలు పెడుతుంది కేంద్రమే కాదా ! పోలవరం మాదిరిగా గాలేరు– నగరి, హంద్రీనీవాతో పాటు రాయలసీమ ఎత్తిపోతలను కేంద్రమే చేపట్టి ఉంటే నేడు సీమ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టేవాళ్లు. ఆ పని ఎందుకు చేయలేదు సార్!
ఇక రహదారులంటారా ! అందులో మీ గొప్పేముంది ? రోడ్డు వేసినోడు టోల్ చార్జీలతో తరతరాలబడి జనం మూలిగలు పీల్చేస్తాడు. ఇందులో కేంద్రానికి పోయేదేముంది ! నేటికీ రాయలసీమ ప్రజలు గుప్పెడు మెతుకుల కోసం పొట్ట చేతబట్టుకొని వలస పోతున్నారంటే ఇక్కడ భూములన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి ? పేదలకు భూవసతితోపాటు సాగునీటి వసతి కల్పిస్తే బీజేపీని అక్కున చేర్చుకునేవాళ్లు. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు కిషన్రెడ్డి భయ్యా !
మీరు చెప్పిన వాస్తవాలపై జనం చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉండి మీరెందుకు చేయలేకపోతున్నారో.. మీరు చెప్పినట్టు వినే సీఎం జగన్ ఇక్కడ ఉండగా ఇంకా సీమ ప్రజలు ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నారో ఆలోచిస్తున్నారు సార్ ! జర సోచాయించురి !