రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించడం ప్రతిపక్ష లక్షణం. దీనికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎలా స్పందిస్తున్నారనేదే ప్రధానం. జంగారెడ్డి గూడెంలో మృతుల దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించిన తీరు వరకు పరిశీలిస్తే.. తెలుగు తమ్ముళ్లు వరుసగా సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ప్రజల్లో మరింత అప్రదిష్టను మూట గట్టుకుంటున్నారు. ఇది తెలుగు దేశం పార్టీకి శాపంగా మారుతోంది.
జంగారెడ్డిగూడెంలో 16 మంది నాటుసారా తాగి చనిపోయినట్లు చెబుతున్నారు. అది ఎంతవరకు వాస్తవమనేది వైద్యులు నిర్ధారిస్తారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వరకు సబబే. ఇవన్నీ వదిలేసి సీఎం జగన్ జె బ్రాండ్ మద్యం వల్లనే చనిపోయినట్లు లంకించుకున్నారు. రకరకాల పేర్లతో సీఎం తాబేదారుల లిక్కర్ కంపెనీల నుంచి తెచ్చి అమ్ముతున్న మద్యం వల్లే జనం ప్రాణాలు పోతున్నాయనే ప్రచారానికి తెరదీశారు. ఈ అంశంపై ఏకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగారు.
దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి వివరాలు వెల్లడించారు. ఇప్పుడు టీడీపీ నేతలు చెబుతున్న ప్రెసిడెంట్, గవర్నర్ లాంటి పేర్లతో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ టీడీపీ హయాంలో తీసుకొచ్చినట్లు ఆధారాలతో సహా నిరూపించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి సరఫరా చేస్తున్న డిస్టిలరీస్ టీడీపీ నేతలకు సంబంధించినవేనని స్పష్టంగా వెల్లడించారు. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు ! ప్రజల్లో అభాసుపాలయ్యారు కదా !
మొన్నటికి మొన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ అజెండా ప్రతులను చించి విసిరేయడం జనం చూశారు. సభలో చర్చించడానికి వీళ్లకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలీదా అని ముక్కున వేలేసుకున్నారు. సభా సమయాన్ని అరుపులు.. రంకెలతో ఎందుకు వృథా చేస్తున్నారని జనంలో చర్చనీయాంశమైంది.
అధికార పార్టీ చర్చించాల్సిన అజెండాకు సంబంధించి బోలెడు లోపాలున్నాయి. వాటి జోలికి పోకుండా సభలో గొడవ చేసి సస్పెండ్ కావడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పటికైనా కాలం చెల్లిన ఎత్తుగడలకు స్వస్తి పలక్కుంటే జనం తెలుగు దేశం పార్టీని పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఆలోచించండి తమ్ముళ్లూ !