ఒకప్పుడు పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ట్రక్కు మట్టి ఎత్తిపోయడానికి రూ.21 వేలు చెల్లించారని బీజేపీ నేతలు తెగ ఇదైపోయారు. ఐదేళ్లు టీడీపీతో కలిసి ఉన్న తర్వాత చేసిన ఆరోపణలు ఇవి. అదే నిజమైతే చంద్రబాబు అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పరు. ఇప్పుడు జగన్ సర్కారును టార్గెట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించామని పార్లమెంటులో కేంద్ర మంత్రి వెల్లడించారు. మరి జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నా అడ్డుపడ్డారా !
రాయలసీమ రణభేరి సభలో బీజేపీ నేతలంతా రాష్ట్ర సర్కారును దుమ్మెత్తి పోశారు. నిధులు ఇస్తుంది కేంద్రం. నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా ! తప్పులు చేయడానికి అవకాశమిచ్చి ఆ తర్వాత వాళ్లను గుప్పెట్లో పెట్టుకుందామనే క్షుద్ర ఆలోచన కాదా ఇది !
అదేమంటే కేంద్రం ఎన్నెన్ని నిధులు ఇస్తుందో.. ఏఏ పథకాల కింద వెచ్చిస్తుందో చెప్పుకొచ్చారు. పర్లేదు. ఆ నిధులన్నీ ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి ఇచ్చేవా లేక బీజేపీ పార్టీ నిధులు ఇస్తున్నారో అర్థం కావడం లేదు.
ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై మరో మెలిక పెట్టారు. పాత డిజైన్ ప్రకారం అంచనా వేసి నిధులు ఇస్తారట. అసలు ఈ దోబూచులాట ఎందుకు ! ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తారో.. ఎప్పుడెంత నిధులు ఇస్తారో కేంద్ర జలశక్తి మంత్రి వెల్లడిస్తే సరిపోతుంది కదా ! ఈ డొంక తిరుగుడు వ్యవహారాలన్నీ ఎందుకు !
అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా ! కేంద్రమే ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ప్రశ్నించడమేంటని జనం నోటిమీద వేలేసుకుంటున్నారు.
ఇదంతా కాదు. సీఎం జగన్ ఏపీలో బలపడకూడదు. అందువల్ల టీడీపీతో దోస్తీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు టీడీపీ బలపడకూడదని చిచ్చు పెట్టారు. ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. బీజేపీ అధికారానికి వచ్చే దాకా ఈ దాగుడు మూతలాట తప్పదేమో ! దీనికి అధికార వైసీపీ సరైన వ్యూహంతో చెక్ పెడుతుందా.. లేక లొంగి పోతుందా అనేది వేచి చూడాల్సిందే.