‘‘గీ సమాజం మారాలని నువ్వొక్కనివే అనుకుంటే అయితదా !’’అన్నారామె.
అర్థం కానట్లు చూశా.
‘నువ్వు పుస్తకాలు చదివినవ్ !
చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసినవ్.
గిదిట్ల ఉండకూడదని తపన పడుతున్నవ్ సరే.
నీ భార్య పిల్లలు గట్లనే ఉంటరా.. ఆల్లకెట్ట అర్థమవ్వాలే !
ఆల్ల సపోర్టు లేకుంటే నువ్వొక్కనివి ఏం చేయగలవ్ !
గందుకే ఆల్లకీ అర్థమవ్వాల. మార్పు వైపు ఆలోచనలుండాలె.
సమజ్ అయిందా !’’
ఆ క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు.
2008లో అనుకుంటా.
ఎన్టీవీలో ఉన్నా.
సాయుధ తెలంగాణ పోరాట దినోత్సవం గురించి స్టోరీ చేస్తున్నా.
మల్లు స్వరాజ్యం వాయిస్ కోసం హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లా.
మనం మాట్లాడేది ఆమెకు చూచాయగా వినిపిస్తుంది.
వచ్చిన పని చెప్పా. వాయిస్ ఇచ్చారు.
అప్పటి ప్రజా ఉద్యమాల గురించి ఆమె మాట్లాడారు.
సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు చైతన్యం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
వాళ్లు లేకుండా ఏ ఉద్యమం పరిపూర్ణత సాధించలేదన్నారు.
ఉరకలెత్తే విద్యార్థి, యువత భాగస్వామ్యం లేకుండా ఏ పోరాటం విజయవంతం కాదన్నారు.
దోపిడీ సమాజం గురించి అవగాహన కుటుంబాల నుంచే రావాలని స్వరాజ్యం ఆకాంక్షించారు.
అందుకు తగ్గట్టుగానే ఆమె కుటుంబం మొత్తం ఉద్యమాలకు అంకితమైంది.
ప్రస్తుతం సీపీఎం పార్టీలో కొనసాగుతున్నారు.
ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగాలనుకుంటుందెవరు !
దోపిడీ లేని సమాజం వైపు మార్పును ఆశిస్తున్నదెవరో..
తెల్చుకోవడంలోనే విజ్ఞత దాగుంది.
అది తెలిస్తే నీ గమ్యాన్ని నిర్దేశించుకోగలవని చాలా గొప్పగా చెప్పారు.
ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. 14వ ఏటనే ఉద్యమంలోకి ఉరికారు. రజాకార్ల పీచమణిచే గెరిల్లా పోరాటంలోకి అడుగు పెట్టారు. మహిళలను పాటల ద్వారా ఉద్యమంలోకి ఆకర్షించారు. నైజాం నవాబుల ఆగడాలకు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. సాయుధ తెలంగాణ పోరాటంలో తనదైన ముద్ర వేసుకున్నారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా ఎన్నడూ ఆ వర్గ స్వభావాన్ని చూపలేదు. కార్మిక కర్షక వర్గ చైతన్యంతో అవిరళంగా పోరాడారు. జీవితాంతం ఉద్యమానికే పునరంకితమయ్యారు. అలాంటి ఉక్కు మహిళను భవిష్యత్తులో చూడలేమేమో. జోహార్ మల్లు స్వరాజ్యం.