పెగాసెస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. టీడీపీ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్లతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు వివాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ప్రకటన చేశారు. పెగాసస్‌పై హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు. శాసనమండలిలో వైసీపీ ప్రతిపాదించిన మేరకు పెగాసస్ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చకు మండలి చైర్మన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ హయాంలో పెగాసెస్ కొనలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పెగాసెస్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయమే చెప్పిందని గుర్తుచేశారు. పెగాసెస్ పట్ల తనపై ఆరోపణలు చేస్తున్నట్లు వాపోయారు. పెగాసెస్ వల్ల ప్రజల్లో అభద్రతా భావం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిఘా చీఫ్‌గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని, మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్ కొనలేదని తెలిపారు. మే 2019 తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు.
ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకుపోయిందని… ప్రభుత్వంలో పోలీసులే రాజ్యమేలుతున్నారని అన్నారు. పోలీస్ యూనిఫామ్ ఇచ్చింది దౌర్జన్యాలు చేయడానికి కాదని హితవు పలికారు. జనాల ఇళ్లకు వెళ్లి పోలీసులు దాడి చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీపీఐ నాయకులను కొట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్టేషన్ కు వెళ్లి న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టడం దారుణమని విమర్శించారు. పోలీసు దాడిలో గాయపడిన బాధితులను ఆదోని ఆసుపత్రిలో రామకృష్ణ పరామర్శించారు.
కరెంటు బిల్లు కట్టకుంటే కనెక్షన్ తొలగిస్తారు. అలాగే స్థానిక సంస్థలకు ఇంటి పన్నులు చెల్లించకుంటే జప్తు చేసే అధికారం ఉంటుందని పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మున్సిపల్ అధికారులు పన్ను చెల్లించలేదని ఓ ఇంటిని సీజ్ చేశారు. పన్నులు సకాలంలో కట్టకుంటే జప్తు చేస్తామని కాకినాడలో ఊరేగింపు చేపట్టడాన్ని మంత్రి సమర్థించారు. పన్నులు చెల్లించకుంటే మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టమవుతుంది. అలాగని ఇళ్లను సీజ్ చేయడం తమ ప్రభుత్వ అభిమతం కాదన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని మంత్రి బొత్సా వెల్లడించారు.