కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి టీఆర్ఎస్ ఆధ్యర్యంలో రైతు పోరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా వరి ధాన్యం కొనుగోలు నిరసనలపై చర్చలు జరుపుతున్నారు. ఈ అంశంపై నాయకులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై ఎంపీలు పార్లమెంట్లో పోరాడాలని కేసీఆర్ సూచించారు.
హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కు అక్రమంగా ‘‘ట్రమడాల్’’ డ్రగ్ తరలిస్తుండగా బెంగళూరు ఎన్సీబీ అధికారులు అడ్డుకున్నారు. పటాన్చెరులోని లూసెంట్ డ్రగ్స్ కంపెనీ నుంచి రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే పాకిస్తాన్కు 2500 కిలోల మెడికల్ మత్తుమందు అక్రమ సరఫరా జరిగినట్లు ఎన్సీబీ గుర్తించింది. ట్రమడాల్ డ్రగ్ ను డెన్మార్క్, జర్మనీ, మలేషియాకు పంపినట్లుగా ఇన్వాయిస్లు లభించాయి. లూసెంట్ డ్రగ్స్ కంపెనీ దొడ్డిదారిన పాకిస్తాన్కు డ్రగ్స్ పంపినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి లూసెంట్ డ్రగ్స్ కంపెనీ ఎండీతో పాటు నలుగురు ఉద్యోగులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
కేంద్రంపై యుద్ధానికి ‘సై’ అంటున్న సీఎం కేసీఆర్.. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరపైకి తెచ్చారని తప్పుబట్టారు. కశ్మీర్లో హిందూ పండిట్లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది చిత్రాలపై కాదని, రైతు సమస్యలపై చర్చ జరగాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.