వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆమె యాత్ర కొనసాగుతోంది. మోట కొండూరు మండలం నుంచి ఆత్మకూరు వెళ్తుండగా దుర్శగానిపల్లి వద్ద షర్మిల రైతులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. షర్మిలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఆమె పాదయాత్రలో తేనెటీగలు దాడి చేయడంతో వ్యక్తిగత సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. షర్మిల వైపు తేనెటీగలు రాకుండా చేతి రుమాళ్లతో విసురుతూ కదిలారు. షర్మిల మాత్రం భయపడకుండా పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు.
వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటితో 400 కిలోమీటర్లు పూర్తి అయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఆమె పర్యటన కొసాగింది. తొలుత ఈరోజు కొండపాక గూడెం నుంచి ఆమె పర్యటన ప్రారంభమైంది. మోటకొండూరు మండలం చండేపల్లిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్టీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.