ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తాజాగా మరో కండీషన్ పెడుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. పోలవరం ప్రాజెక్టుపై తాజాగా మరోసారి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాల్సిందేనని కేంద్ర సర్కార్ షరతులు పెట్టింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బ్రహ్మానందరెడ్డి, సత్యవతి, రెడ్డప్ప అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిస్వేస్వర్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అంతేకాదు డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ పైనా డీపీఆర్ తయారు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరో నిబంధన పెట్టింది.
ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15, 668 కోట్ల వరకే తమ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.14,336 కోట్లు మాత్రమేనని పేర్కొంది.
దీనిలో రూ. 12,311 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది. అలాగే రూ. 437 కోట్లకు పోలవరం ఆధారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. కేంద్రం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇటీవలే పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేకు సంబంధించి మొత్తం 48 గేట్లను బిగించింది కాంట్రాక్ట్ సంస్థ. మిగతా పనులనూ దాదాపుగా పూర్తి చేసింది. జూలై నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇటీవలే అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఇసుక వివాదంతో ప్రాజెక్టు పనులకు కొంత అంతరాయం కలిగింది.