ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పొత్తులపై కీలక పరిణామాలు కనిపిస్తున్నాయి. 2014లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేన మరోసారి అదే సంకేతమిచ్చింది. తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమన్నట్టుగా జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.
జనసేనతో పొత్తును మెజార్టీ టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. అదే జరిగితే తమకు అధికారం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొందరు తమ్ముళ్లకు మాత్రం టెన్షన్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు కారణంగా తమకు ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన పడుతున్నారు.
2014 ఎన్నికల్లో మాదిరి పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా లేదు. ఈసారి ఆ పార్టీ పొత్తుల్లో భాగంగా భారీగానే సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ అవసరాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అందుకు దాదాపు అంగీకరించేట్లున్నారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఎక్కువగా ఐదు జిల్లాల్లో టీడీపీ నాయకులపై ప్రభావం ఉంటుందనే గుబులు మొదలైంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా తమకు పట్టున్న స్థానాల్లోనే ఎక్కువగా సీట్లను డిమాండ్ చేసే అవకాశముంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ స్థానాలు అడుగుతారు. జనసేన పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లోని టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు.. పొత్తుల్లో భాగంగా తమ సీట్లను కోల్పోవాల్సి రావొచ్చని భయపడుతున్నారట. దీంతో కొందరు టీడీపీ నేతలు ముందుగానే అలర్ట్గా అవుతున్నారు.
పొత్తుల్లో సీటును కోల్పోవాల్సి వస్తే టీడీపీని వీడి జనసేనలోకి వెళ్లడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని టీడీపీకి చెందిన కాపు నేతల్లో ఎక్కువమంది ఈ పరిస్థితి వస్తే జనసేనలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారట. అయితే టీడీపీ నాయకత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు పొత్తుల గురించి సానుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో స్థానిక నేతల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతుంది. దీనికి చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి మరి.