సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని రఘురామ కోరారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని రఘురామ లేఖలో కోరారు
అటవీ అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. జిల్లాపరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అవరోధ శాఖ అధికారులుగా తయారయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరైన రహదారులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల మాటలను కూడా అధికారులు లెక్క చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అధికారులు సిగ్గు పడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆమరణదీక్ష భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను భీమవరం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయినా బలవంతంగా బండారును ఆసుపత్రికి తరలించారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ మాధవనాయుడు చేపట్టిన ఆమరణ దీక్షకు పూనుకున్నారు. నేటితో ఆయన దీక్ష మూడో రోజుకు చేరింది. బండారు దీక్షకు భారీ ఎత్తున నరసాపురం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు మండిపడ్డారు. ఇటీవల పోలవరంలో పర్యటించిన కేంద్రమంత్రి ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిదే అన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం మరోసారి మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదన్నారు. రాయ్‌ఘడ్‌లో డివిజన్ అంటున్నారని, విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖర్చులపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.