తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఢిల్లీ తర్వాత పంజాబ్ లో అధికారం చేపట్టిన జోష్ తో ఆప్ మరికొన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. అందులో తెలంగాణ కూడా ఉంది. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో ఆప్ పాదయాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో బిగ్ పర్సనాలిటీకి గాలం వేశారు. ఆప్‌లో టీజేఎస్ విలీనం కాబోతోందనే చర్చ జరుగుతోంది.
ఇటీవలే తెలంగాణ జ నసమితి నేతలు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఆప్ లో టీజేఎస్ విలీనంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫామ్ హౌస్‌లో ఈ భేటీ సాగిందని చెబుతున్నారు. సమావేశంలో కోదండరామ్‌తోపాటు టీజేఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారట.
ఆప్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై పార్టీ నేతలతో కోదండరాం మంతనాలు జరిపారు. సమావేశంలో చాలా మంది నేతలు ఆప్‌వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నారట. ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుందామని నేతలతో ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలో కేజ్రీవాల్ తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈక్రమంలోనే టీజేఎస్ నేతలతో ఆప్ నాయకులు మంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ తెలంగాణ పర్యటనకు ముందే విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. ఇదే జరిగితే ఆప్ విధానాలకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశముంది.