టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తన రాజీనామా ఆమోదం కోసం కోర్టుకు వెళ్లబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలిచారు. స్టీల్ ప్లాంటు కార్మిక సంఘాల పోరాటానికి నైతిక మద్దతు తెలుపుతూ గతేడాది ఫిబ్రవరి 6న ఆయన తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు.
అయితే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మాట్ లో మరోసారి రాజీనామా సమర్పించారు. అసెంబ్లీ స్పీకర్ ను నేరుగా కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఆయన రాజీనామాకు ఆమోదం లభించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు మరోసారి లేఖ రాశారు. అయినా ఆమోదించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని గంటా భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉండటం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీ విశాఖ ఎమ్మెల్యే సమావేశానికి రావాలంటూ టీడీపీ అధినేత నుంచి సమాచారం పంపినా ఆయన డుమ్మా కొట్టారు. చాలా కాలంగా గంటా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై ఆయన మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
ఇటీవలే కాపు నేతల సమావేశాలకు గంటా హాజరయ్యారు. హైదరాబాద్… విశాఖల్లో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాపు నేతలు ఏర్పాటు చేసిన ఫోరం ఫర్ బెటర్ ఏపీ అనే సంస్థ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. విశాఖ జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ వంగవీటి రాధాతో కలిసి పాల్గొన్నారు. దీంతో గంటా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియడం లేదు.
రాజీనామా ఆమోదించాలని కోర్టుకు వెళ్లడం ద్వారా గంటా శ్రీనివాసరావు వ్యూహం ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంటా టీడీపీ వీడి వచ్చే ఎన్నికల్లొ మరో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి ముందుగానే స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా చేసిన రాజీనామా ఆమోదించుకోవటం ద్వారా వ్యక్తిగతంగా మైలేజ్ దక్కించుకొనే వ్యూహాన్ని గంటా అమలు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.