ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారాన్ని కైవసం చేసుకుంది. మొన్నటి పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను వెనక్కి కొట్టేసింది. అంతటితో ఆప్ జైత్ర యాత్ర ఆగలేదు. పొరుగునున్న తెలంగాణలో పాగా వేసింది. అక్కడ టీజేఎస్‌తో మంతనాలు జరుపుతోంది. ఇక ఏపీలో అయితే వైసీపీ, టీడీపీ అసంతృప్తి నేతలపై గురి పెట్టింది. కులమతాలకు అతీతంగా వ్యవహరించే ఆప్ ఏమేరకు సఫలీకృతమవుతుందో మరి.
ఆమ్ఆద్మీ పార్టీ విధానాలు నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దేశంలోకెల్లా అప్పులు లేని రాష్ర్టంగా ఢిల్లీని అద్భుతంగా తీర్చి దిద్దిన ఘనత ఆప్ దే. విద్యా, వైద్య రంగాల్లో ఆప్ తీసుకొచ్చిన పెనుమార్పులు అన్ని రాష్ట్రాలను ఆలోచనలో పడేశాయి. సగటు పౌరుడి జీవన వ్యయంలో సింహభాగం వహిస్తున్న విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించడం ద్వారా వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అనివార్యంగా అది ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు దోహదపడుతుంది. ఢిల్లీలో ఆప్ సక్సెస్ ఫార్ములా ఇందులోనే ఉంది.
పొరుగునున్న తెలంగాణలో టీజేఎస్‌తో ఆప్ నేతలు మంతనాలు జరిపారు. ఇక్కడ సీపీఐ నేత సుధాకర్ ఆప్‌లో చేరారు. టీజేఎస్ కూడా కలిసొస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ కీలక శక్తిగా మారుతుంది. సంప్రదాయ పార్టీల అవినీతి.. బంధుప్రీతి, కుటుంబాల పాలనతో జనం విసిగెత్తి పోయారు. అటు బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారానికి రావాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ, ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఆప్ కనిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకుల్లేరు. గత కొంత కాలంగా ఆప్ చేస్తున్న ప్రయత్నాలతో ఇక్కడ నుంచి కొందరు రైతు సంఘ నేతలు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఆప్‌తో టచ్‌లో ఉన్నారు. కేవలం కొద్ది మంది మాజీ నేతలతో ఎంట్రీ ఇవ్వడానికి ఆప్ నాయకత్వం ఇష్ట పడలేదు. దీంతో వైసీపీ, టీడీపీలో తటస్థ వైఖరి కలిగిన నేతలపై గురి పెట్టింది. ఈ రెండు పార్టీల పోకడలతో విసుగెత్తిన నాయకులు ఆప్ తెలుగు రాష్ట్రాల సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న బాదర్ల కృష్ణ ప్రసాద్‌ను సంప్రదిస్తున్నారు.

‘ఢిల్లీలో తొలిసారి విజయపతాకం ఎగరేసిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోనూ ఆప్ నేతలు పర్యటించారు. ఇక్కడ పార్టీ బలోపేతానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ప్రతీ జిల్లాలో ఆప్ కార్యకర్తలు ఏర్పాటయ్యారు. ఇప్పుడు వివిధ ప్రజా సంఘాల్లో.. ఉద్యమాల్లో పనిచేసిన నేతలు వస్తున్నారు. వారితోపాటు వైసీపీ, టీడీపీ నుంచి రాజకీయంగా ఆప్ విధానాలు నచ్చి వస్తున్న వాళ్లు సంప్రదిస్తున్నారు. ఎవరెవరనేది త్వరలో వెల్లడిస్తాం!’ అని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇక్కడ కులమతాల రాజకీయాలను దాటి రావడం కష్టమేమో అనిపిస్తుంది. కానీ ముందు విత్తనం పడితేనేగా కొన్నాళ్ళకి వృక్షం అయ్యేది. ఆప్ AP కి రావడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నాలాగే వుంటారేమో మరికొందరు చూద్దాం