యాదాద్రి ఆలయ సంప్రోక్షణ నిర్వహణలో ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. స్థానిక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఆలయ పున ప్రారంభ వేడుకకు ఆహ్వానించకపోవడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలను మాత్రమే ఆహ్వానించి విపక్ష నేతలను విస్మరించినట్లు తెలిపారు.
యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధినైన తనను పిలవలేదంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి పునఃప్రారంభానికి సీఎంవో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. కేవలం అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించారని, దేవుడి దగ్గర సీఎం కేసీఆర్ నీచ రాజకీయం చేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ సాకారమైంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరిగింది. దివ్య విమాన గోపురంపై శ్రీసుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ నిర్వహించారు.
ఆరేండ్ల తర్వాత ఉత్సవ మూర్తులను యాదాద్రి గర్భాలయంలోకి చేర్చారు. అనంతరం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.