తమిళనాడు కు చెందిన బాబు రాజశేఖరన్ వృత్తి రీత్యా ఐటి ఉద్యోగి , చిన్నతనం నుంచి వ్యవసాయమంటే ఎంతో ఆసక్తి. ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయంపై మక్కువ పోలేదు. 2015 లో ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబ సభ్యుల సహకారంతో వ్యవసాయంలోకి దిగాడు. నీలగిరి జిల్లాలోని సొంతూళ్లో 3000 అంట్లతో స్ట్రాబెర్రీ సాగు మొదలు పెట్టాడు. అంతకు ముందే సేంద్రీయ సేద్యం , శాస్త్రీయ సాగు పద్ధతుల గురించి బాగా అధ్యయనం చేశాడు.
ఓ ఏడాది పాటు ప్రయోగాత్మక పద్ధతులు అనుసరించి కొన్ని చేదు ఫలితాలు పొందాడు. వాటన్నింటినీ లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు సాగాడు. అతడి ప్రయోగాలు ఫలించాయి. స్ట్రాబెర్రీ పంట చేతికి రావడంతో విక్రయాలు మొదలు పెట్టాడు. వాటికి డిమాండ్ పెరగడంతో క్రమంగా తమిళనాడు లోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాడు.
ప్రస్తుతం ఆయన తోటలో 30,000 స్ట్రాబెర్రీ మొక్కలున్నాయి. అవి 10- 15 మెట్రిక్ టన్నుల స్ట్రాబెర్రీ పండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంత దిగుబడి సాధించేందుకు ఆయన ఆధునిక పద్ధతులను అమలు చేయడమే కారణం. ప్రతి రోజు ఆయనే స్వయంగా మొక్కలకు జీవామృతం ఎరువును తయారు చేసి వేయడమే కాకుండా క్రిమికీటకాలను ఎదుర్కొవడానికి వాటి చుట్టూ బగ్ రిపెలింగ్ ప్లాంట్స్ నాటాడు.
స్ట్రాబెర్రీ సాగులో ఖర్చులు పోను ఆదాయం భారీగా రావడంతో తన గ్రామంలో ఉన్న మరి కొందరిని స్ట్రాబెర్రీ సాగు చేసేందుకు ప్రోత్సహిస్తున్నాడు. రాజశేఖరన్ తోటలోని స్ట్రాబెర్రీ పంట కోసం పలు ఆహార పదార్థాలను తయారు చేసే సంస్థలు ఆర్డర్స్ ఇచ్చాయి. అలాగే చిన్నపిల్లలు తినే ఆహారం కోసం చేస్తున్న ప్రయోగాల ప్రాజెక్టు కు ఎంపిక కావడంతో రాజశేఖరన్ ఆనందానికి అవధుల్లేవు. రాబోయే రోజుల్లో కూరగాయలను , ఇతర పంటలను పండించాలనుకుంటున్నాడు. హ్యాట్సాఫ్ యూ రాజశేఖరన్. గో ఏ హెడ్ !