మీడియా విస్తృతి పెరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మాధ్యమాలు మరింతగా విస్తరించాయి. పెద్దగా వేతనాలుండవు. పనికి వేళాపాళా ఉండదు. కాలంతోపాటు పరిగెత్తాలి. అయినా పెరుగుతున్న నిరుద్యోగం.. ఉపాధి లేమితో జర్నలిజంలోకి అనేక వేల మంది వచ్చేశారు. వచ్చేస్తున్నారు. ఏవో కొద్దిపాటి సంస్థలు మినహా మిగతావి వేతనాలు ఇవ్వవు. ఆ సంస్థలకే విలేకరులు ఆదాయం తెచ్చిపెట్టాలి. ఇలా కత్తి మీద సాములాంటి జీవితాల పట్ల తెలుగు ప్రభుత్వాలు ఇంత నిర్దయగా వ్యవహరించడం దారుణం.
నిన్నటికి నిన్న తెలంగాణలో ప్రెస్ అనే స్టిక్కర్ కలిగిన వాహనాలపై అపరాధ రుసుం విధించారు. పోలిస్.. జ్యూడిషియరీ, వైద్యుడు.. ఇలా అందరూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. మరి ప్రెస్ అని విలేకరులు స్టిక్కర్ వేసుకుంటే తప్పేంటో అర్థం కావడం లేదు. ప్రెస్ లేదా మీడియాలో లేని వాళ్లు స్టిక్కర్ వేసుకుంటే ఫైన్ వేయొచ్చు. తాను జర్నలిస్టునని ఐడీ కార్డు చూపినా రూ.700 అపరాధ రుసుం విధించారు. మీడియాపై ఎందుకంత ఉక్రోషం !
గడచిన మూడేళ్ల నుంచి ఏపీలోనూ ప్రభుత్వం మీడియాను శత్రువుగా చూస్తోంది. అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడానికి ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అలవికాని నిబంధనలు పెట్టి వేధిస్తున్నారు. చిన్నాచితకా పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి అనుకూల మీడియా.. వ్యతిరేక మీడియా అంటూ వర్గీకరించారు. పోనీ అనుకూల మీడియాలో పనిచేస్తున్న వాళ్లకు ఏమైనా ఒరగబెట్టారా అంటే అదీ లేదు.
నిరంతరం ప్రజా చైతన్య స్రవంతిలో భాగమైన జర్నలిస్టులంటే రెండు ప్రభుత్వాలకు చులకనే. పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తారు. ముల్లాలకు.. పూజారులకూ ఇస్తున్నారు. చివరకు లాయర్లకూ ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు. మరి క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసే విలేకరులు ఏం పాపం చేశారు ! వాళ్లకూ కుటుంబాలున్నాయి. ఓట్లు కూడా ఉన్నాయి. వీటన్నింటితోపాటు వాయిస్ ఉంది. ప్రజాభిప్రాయాన్ని మలచగల శక్తి సామర్థ్యాలూ ఉన్నాయి. ఇవెలా మరిచారు సార్ !