పర్యావరణానికి ప్రాణం పచ్చని చెట్లే. చెట్లను కొట్టేయడమంటే మనిషి తాను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే. మనిషి చస్తే కాల్చడానికీ కలప కావాలంటే చెట్లే ఆధారమయ్యాయి. ఇలా అయిన దానికీ కాని దానికి చెట్లను నరికేస్తుంటే.. అవనిపై జీవరాశులు మనగలిగే పరిస్థితి ఉండదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరు పట్టించుకున్నా లేకున్నా కొన్ని నగరాలు మాత్రం ఈ ప్రమాదాన్ని ఊహించి పర్యావరణ హిత మార్గంలో ముందుకు పోతున్నాయి.
నాగపూర్ , పూణే, పనాజీ నగరాల్లో మరణించిన వ్యక్తుల దహన సంస్కారాలకు వారి కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవిస్తూ ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. కలపకు బదులు కృత్రిమంగా తయారు చేసిన బ్రిక్వెట్స్ ను వాడాలని నాగపూర్ కు చెందిన పర్యావరణ వేత్త విజయ్ లిమాయే సూచించారు. అసలు ఇంతకీ ఈ బ్రిక్వెట్స్ ఎలా తయారు చేస్తారో చూద్దామా ..!
పత్తి చెట్ల కాడలు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో తయారైన గట్టి ఇటుకలే ” బ్రిక్వెట్స్”. పుణేకు చెందిన స్మిత వాస్తే, సరస్వతి షిండేజ్ ఈ పద్ధతిని ప్రతిపాదించారు. దహన సంస్కారాల్లో కలపను వాడటం ద్వారా చెట్లు తరిగిపోతున్నాయి, దీంతో పర్యావరణ సమతుల్యత , పచ్చ దనం తగ్గిపోతున్నాయి. అదే బ్రిక్వెట్స్ వాడకం ద్వారా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఈ బయో మాస్ బ్రిక్వెట్స్ ను వైట్ కోల్ గా పేర్కొంటున్నారు.
పర్యావరణానికి ఏంతో మేలు చేసే బ్రిక్వెట్స్ గుర్తించిన ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు వీటి గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. పనాజీ రోటరీ క్లబ్ కూడా పర్యావరణ హిత పద్ధతికి మద్దతు పలుకుతూ ఆ పట్టణంలో జరిగే దహన కార్యక్రమాలకు ఉచితంగా వీటిని సరఫరా చేస్తోంది.
దహన కార్యక్రమాల్లో కలపకు బదులు బ్రిక్వెట్స్ ను వాడడం వల్ల సుమారు రూ.3 వేల ఖర్చు ఆదా అవుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. వీటి తయారీ కోసం వ్యవసాయ వ్యర్థాలను రైతుల నుంచి సేకరించడం ద్వారా వాళ్ల ఆదాయం పెరిగేందుకూ సాయం చేసినట్టవుతుంది. అయ్యా.. పెద్దలూ ఈ దిశగా ఆలోచించండి !