తెలంగాణలో ప్రస్తుతం సర్వేల సీజన్ నడుస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ఎంపిక కోసం జోరుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీమ్ తోపాటు ఇతర సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే పీకీ టీమ్ మొదటి రౌండ్ సర్వే ఫలితాల రిపోర్టును కేసీఆర్ కు ఇచ్చింది. అందులో షాకింగ్ విషయాలు ఉన్నాయంటున్నారు.
చాలా చోట్ల సిట్టింగులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైందట. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 103 మంది సభ్యులున్నారు.మొత్తం 103 మంది సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు సర్వేలు జరిపించారట కేసీఆర్. 103 అసెంబ్లీ నియోజకవర్గాల తుది సర్వే నివేదికలు ఏప్రిల్ 15లోగా సీఎం చేతికి అందనున్నాయి.
ఇప్పటికే తొలి రిపోర్టు ప్రగతి భవవన్ టేబుల్ పైకి వచ్చేసినట్లు తెలుస్తోంది. సర్వేల్లో దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనాల్లో ఆగ్రహం ఉన్నట్లు తేలిందట. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లు సంతోషంగా ఉన్నా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మాత్రం ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు ఈసారి కొత్త ముఖాలను జనం కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది.
ప్రధానంగా ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారి నియోజకవర్గాల్లో సిట్టింగ్ లపై వ్యతిరేక ధోరణి కనిపించింది. మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 80 మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచినవారే. 40 మంది ఎమ్మెల్యేలు రెండు దఫాలుగా ఎన్నికైనవారున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు మూడు సార్లు, 12 మంది ఎమ్మెల్సీలు నాలుగుసార్లు, నలుగురు ఎమ్మెల్యేలు ఐదుసార్లు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరుసార్లు గెలిచినవారున్నారు.
అనేకసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు టీఆర్ఎస్కు చెందినవారే. ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్నట్లు పీకే సర్వేలో తేలిందట. అయితే అంతమందికీ టికెట్లు నిరాకరిస్తే ఏర్పడే పరిణామాలను అంచనా వేస్తున్నారు.
కొందరికి పనితీరును మెరుగుపరచుకోవడానికి కేసీఆర్ ఆరు నెలల సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆరు నెలల తర్వాత తిరిగి సర్వే చేయిస్తామని, ఆలోగా పని తీరు, ప్రజాదరణ మెరుగుపర్చుకోలేని ఎమ్మెల్యేలకు 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వరాదని గులాబీ బాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.