ఏపీలో మొట్టమొదటగా తిరుపతిలో మహిళల ప్రత్యేక ఆటో స్టాండ్లు వచ్చేశాయి. మహిళా డ్రైవర్లు నడిపే ఆటోలకు ప్రత్యేక స్టాండ్స్ ఏర్పాటు వెనుక తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు కృషి ఉంది. మహిళలు నడిపే ఆటోలకు టాప్ పింక్ కలర్లో ఉంటుంది. ఇలాంటి ఆలోచనకు రూప కల్పన చేసినందుకు ‘హ్యాట్సాఫ్ యూ సర్ !’అంటూ మహిళా ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నిత్యం యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల మహిళలు ఆటో డ్రైవర్లుగా ఎదిగారు. కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు.. కష్టాలను చవిచూసి ఉంటారు. బంధాల భారాన్ని మోయడానికి ఎందరో మహిళలు ఆటో డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. మగవాళ్లు డ్రైవర్లుగా ఉన్నచోట మహిళా డ్రైవర్లకు ఇబ్బందులేవీ లేవు. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా ఎస్పీ వెంకటప్పలనాయుడు షీ ఆటో స్టాండ్లకు రూప కల్పన చేశారు.
నగరంలోని ఆర్టీసీ బస్టాండు, మహిళా విశ్వ విద్యాలయం, రుయా ఆస్పత్రి వద్ద ప్రత్యేక మహిళా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పింక్ కలర్ టాప్‌తో ఉండే ఆటోలు మాత్రమే ఉంటాయి. ప్రత్యేకించి రాత్రి వేళల్లో మహిళలు ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించాలంటే ఆందోళన చెందుతున్నారు. ఇక అలాంటి సమస్య తలెత్తకుండా కీలకమైన ప్రాంతాల్లో మహిళలు నడిపే ఆటోలు నిలిచే స్టాండ్లను ఏర్పాటు చేశారు.

ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి షీ ఆటో స్టాండ్లను ప్రారంభించారు. గత కొంత కాలంగా కుటుంబ పోషణ కష్టమైన మహిళలు ఆటో డ్రైవర్లుగా శిక్షణ పొంది ఉపాధిగా ఎంచుకున్నట్లు మేయర్ శిరీష, నగర కమిషనర్ గిరీషా, ఎస్పీ వెంకటప్పల నాయుడు వెల్లడించారు.
మహిళలు నడుపుతున్న ఆటోలకు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క ప్రమాదం కూడా జరగలేదని వివరించారు. మహిళలు కుటుంబాలను ఎంత చక్కగా నడుపుకుంటున్నారో ఆటోలను కూడా అంతే సురక్షితంగా నడుపుతున్నట్లు తాము గుర్తించామన్నారు. అందుకే ప్రత్యేక స్టాండ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.