హిమాచల్ ప్రదేశ్ లో ఒక మారుమూలనున్న హిక్కిం పోస్టాఫీసుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు గా ప్రసిద్ధి గాంచింది. హిమాలయ పర్వతాల నడుమ స్పితి లోయలో ఉంటుంది. సముద్ర మాట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పోస్టాఫీసును 1983లో భారత తపాలా శాఖ ప్రారంభించింది. హిక్కిం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ ఈ పోస్టాఫీసు సేవలను అందిస్తోంది.
ఉత్తరాలు పంపేందుకు , సేవింగ్స్ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ప్రజలు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు అత్యంత ఎత్తులోని ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు పంపడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తూ తన్మయత్వం చెందుతుంటారు.
ఇక్కడి నుంచి ఉత్తరాలు బట్వాడా చేయాలంటే చాలా వరకు కాలి నడకనే వెళ్లాలి. ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలను దగ్గర్లోని కాజా పట్టణానికి తరలించేందుకు రోజూ ఇద్దరు పోస్టు మ్యాన్ లు కొండ కోనలు దాటుకుంటూ వెళ్లాలి. రానుపోనూ కలిపి 46 కిలోమీటర్లు ప్రయాణిస్తారు.
హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉండడం వల్ల చలికాలంలో ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది. అందువల్ల చాలా సార్లు పోస్ట్ ఆఫీస్ సేవలను కొనసాగించడం కష్టమవుతుంది. అందువల్ల అప్పుడప్పుడు మూసేస్తారని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ పోస్టాఫీసు భవిష్యత్తులో ఓ గొప్ప చారిత్రక గుర్తుగా నిలుస్తుందేమో కదా !